Share News

భవితవ్యం తేలేది నేడే

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:56 PM

సర్వత్రా ఉత్కంఠరేకెత్తించిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది.

భవితవ్యం తేలేది నేడే

చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

అభ్యర్థులందరికీ అగ్ని పరీక్షే

పైకి ధీమా.. లోపల టెన్షన్‌..!

గెలిచిన వారికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్‌!

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సర్వేలు

సఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌గా మారిన ఎన్నికలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : సర్వత్రా ఉత్కంఠరేకెత్తించిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలు పూర్తిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. అయితే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో ఉండగా.. షాద్‌నగర్‌, కల్వకుర్తి, కొడంగల్‌ అసెంబ్లీ స్థానాలు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో జరిగిన ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ బరిలో మహామహులు బరిలో దిగారు. ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు పోరాడారు. దీంతో ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. దాదాపు అభ్యర్థులందరి రాజకీయ భవిష్యత్తు ఈ ఫలితాలతో ముడిపడి ఉంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఈ ఎన్నికల ఫలితాలు సవాల్‌గా మారాయి. ఈ అయిదు స్థానాల అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలు పూర్తిగా రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఆయన సిట్టింగ్‌ స్థానం కావడంతో దీన్ని నిలబెట్టుకోవడం సవాల్‌గా మారింది. అలాగే ఆయన కొన్నాళ్ల పాటు ఇన్‌చార్జ్‌గా ఉన్న చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికలను కూడా ఆయన సవాల్‌గా తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉండడంతో ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి చెందితే సీఎం రేవంత్‌రెడ్డికి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లలో హోరాహోరీగా పోటీ జరిగింది. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అపర కుబేరులను రంగంలో దింపాయి. ప్రముఖ ఫౌలీ్ట్ర వ్యాపారవేత్త, సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తుండగా బీఆర్‌ఎస్‌ నుంచి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇంకా మరికొందరు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ ఈ ముగ్గురు మధ్యే నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు శ్రీమంతులు కావడంతో ఆయా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బును వెదజల్లాయి. ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు రూ. 300కోట్లకుపైగానే ఖర్చుచేస్తున్నట్లు అంచనా. ఈ ముగ్గురు అభ్యర్థులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఓటమి చెందిన వారికి ఇక రాజకీయ భవిష్యత్తు కష్టమేనని చెప్పాలి. ఇప్పటికే ఈ ముగ్గురు అభ్యర్థులు పార్టీలు మారారు. అలాగే మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ సునీతారెడ్డి, ఈటల రాజేందర్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీరిద్దరికీ ఈ ఎన్నికలు సవాలేనని చెప్పాలి. అలాగే మహబూబ్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున చల్లా వంశీచంద్‌ రెడ్డి, బీజేపీ తరుపున మాజీమంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు.

పైకి ధీమా.. లోపల టెన్షన్‌..!

ప్రధాన పార్టీ అభ్యర్థులంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలింగ్‌ సరళి చూసి లోలోపల ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో ఇతర పార్టీల అంచనాలన్నీ తారుమారయ్యాయి. అయితే గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ పెరిగింది. కొన్నిచోట్ల పెరిగిన ఓటింగ్‌, మరికొన్ని చోట్ల తగ్గిన ఓటింగ్‌ ప్రభావం తమపై ఏ మేర ప్రభావం చూపుతుందోనని లెక్కలు వేసుకుంటున్నారు.

గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి...

ఈ ఎన్నికల్లో గెలిచే బీజేపీ అభ్యర్థులకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఇప్పటికే ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయడంతో బీజేపీ అభ్యర్థుల్లో ఆశలు చెలరేగుతున్నాయి. బీజేపీ మళ్లీ కేంద్రంలో పగ్గాలు చేపడితే మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణలలో ఎవరికైనా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్‌ లభించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 11:56 PM