Share News

జిల్లా ఓటర్లు 9,83,740 మంది

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:42 AM

పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్ల లెక్క తేలింది.

జిల్లా ఓటర్లు 9,83,740 మంది

అనుబంధ ఓటర్ల జాబితా విడుదల

పార్లమెంట్‌ ఎన్నికలకు తేలిన ఓటర్ల లెక్క

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలో 9,83,740 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్క తేల్చింది. జిల్లా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 9,83,740 మంది ఓటర్లున్నట్లు ప్రకటించారు. వీరిలో సాధారణ ఓటర్లు 9,83,191 మంది, 549 సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. సాధారణ ఓటర్లలో 4,85,210 మంది పురుషులు, 4,97,946 మంది మహిళలు, 35 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుబంధ ఓటర్ల వివరాలను విడుదల చేశారు. జిల్లాలో కెల్లా పరిగి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో, అత్యల్పంగా వికారాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. పరిగిలో 2,66,819, వికారాబాద్‌లో 2,31,717 మంది ఓటర్ల చొప్పున ఉన్నారు. పరిగి, వికారాబాద్‌, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి, కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి.

జిల్లాలో తగ్గిన ఓటర్లు

2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన ఓటర్ల జాబితాతో పోలిస్తే జిల్లాలో మరో 328 మంది ఓటర్లు తగ్గారు. జనవరి 6న ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 9,71,011 మంది ఉండగా, ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రక్రియ అనంతరం ఓటర్లు 9,84,068 మందికి పెరిగారు. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు కొనసాగిన ఓటర్ల నమోదు, మార్పుల చేర్పులకు 10,342 దరఖాస్తులొచ్చాయి. కొత్తగా ఓటరు నమోదుకు 9,332, మార్పులకు 1,010 దరఖాస్తులందాయి. పరిశీలనానంతరం అర్హులను అనుబంధ జాబితాల్లో చేర్చారు. జనవరి 6న ప్రకటించిన ముసాయిదాతో పోలిస్తే జిల్లాలో 12,729 మంది ఓటర్లు పెరిగారు. ఆ తరువాత ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకున్నారు.

మూడు నియోజకవర్గాల్లోమహిళా ఓటర్లు ఎక్కువ

వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో పురుషుల కంటే 1,621 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. తాండూరులో పురుషుల కంటే 7,493 మంది, కొడంగల్‌ నియోజకవర్గంలో పురుషుల కంటే 3,921 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా పరిగి నియోజకవర్గంలో మాత్రం పురుష ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మహిళల కంటే 826 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 10:20 AM