పచ్చని కాపురంలో ట్యాక్సీ డ్రైవర్ చిచ్చు
ABN , Publish Date - Oct 08 , 2024 | 11:51 PM
లండన్‌లో స్థిరపడిన కుటుంబం.. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడో ఓ ట్యాక్సీ డ్రైవర్. ఈ ఘటన శంషాబాద్‌లోని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇద్దరు పిల్లలున్న మహిళను ట్రాప్ చేసిన కేటుగాడు
ఆర్జీఐఏ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు
లండన్‌లో స్థిరపడిన కుటుంబం
శంషాబాద్ రూరల్, అక్టోబరు 8 : లండన్‌లో స్థిరపడిన కుటుంబం.. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడో ఓ ట్యాక్సీ డ్రైవర్. ఈ ఘటన శంషాబాద్‌లోని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆ జంటకు 17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి కుమారుడు(13), కూతురు(12) ఉన్నారు. ఉద్యోగ బదిలీల్లో భాగంగా కొన్నేళ్ల క్రితం లండన్‌లో స్థిరపడ్డారు. 2024 ఫిబ్రవరిలో ఆమె తల్లి చనిపోయింది. అంత్యక్రియల కోసం లండన్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఆ కుటుంబం. అయితే, అంత్యక్రియల అనంతరం 11 రోజుల తర్వాత అస్థికలను కలిపేందుకు బయటకు వెళ్లడానికి పహాడీషరీ్‌ఫకు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకున్నారు. అస్థికలు నదిలో కలిపిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చారు. ట్యాక్సీ డ్రైవర్‌కు భార్య ఫోన్‌నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించారు. అయితే, ఆమె ఫోన్‌నంబర్ సేవ్ చేసుకున్న ట్యాక్సీడ్రైవర్ ‘నీ నవ్వు బాగుంది.. మీరు చాలా అందంగా ఉంటారంటూ.. ట్రాప్‌లోకి దింపాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్న ఆ మహిళ డ్రైవర్ మాటలకు మోసపోయి కొన్ని నెలలుగా అతనితో ఫోన్‌లో మాట్లాడుతోంది. విషయం అత్తగారింట్లో తెలియడంతో తమ కుమారుడికి విషయాన్ని చెప్పారు. వెంటనే కుమారుడు భార్యాపిల్లలను సెప్టెంబరు 16న లండన్‌కు రప్పించాడు. అయితే, సెప్టెంబరు 29న భర్త తల్లి చనిపోయింది. భార్యాపిల్లలను లండన్‌లో వదిలి అతడు ఒక్కడే ఇండియా వచ్చి తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
కిడ్నాప్ చేశారంటూ..
ఆ సమయంలో లండన్‌లో ఉన్న ఆ మహిళ తన పిల్లలను ఒక పార్క్‌లో వదిలేసి సెప్టెంబరు 30న ఇండియాకు వచ్చింది. పిల్లలు వెంటనే తండ్రికి విషయం చెప్పారు. దాంతో ఆయన హుటాహుటిన లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె గురించి ఆరా తీయగా ఇండియాకి వచ్చి ముంబయి వెళ్లి అక్కడి నుంచి శంషాబాద్‌లోని మధురానగర్‌లో ఉన్నట్లు భర్త ఫోన్ చేయగా చెప్పింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని శంషాబాద్‌లో పెట్టారని భర్తతో చెప్పడంతో.. భర్త ఈనెల 6న ఆన్‌లైన్‌లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ట్యాక్సీ డ్రైవర్ సెల్‌ఫోన్ ట్రాక్ చేశారు. ఆమె డ్రైవర్‌తో కలిసి కారులో గోవాకు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వద్ద పట్టుకున్నారు. సోమవారం లండన్ నుంచి శంషాబాద్ వచ్చిన ఆమె భర్తకు ఆమెను అప్పగించి లండన్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.