Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:52 PM

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి శశాంక అధికారులను ఆదేశించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 26 : పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోలింగ్‌, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఎవరికిస్తారనే విషయంపై అధికారులకు అవగాహనుండాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బందికి, ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్‌ సిబ్బందికి, పోలీస్‌ సిబ్బందికి, సర్వీస్‌ ఓటర్లకు ఫారం-12 ఇచ్చి దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటు వేసేలా ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడానికి వచ్చే ఇతర జిల్లా, ప్రాంత సిబ్బందికి ఒక రోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజురు చేస్తామన్నారు. చెల్లని పోస్టల్‌ బ్యాలెట్లు పడకుండా ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఆర్వో పీడీ సంగీత, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి కృష్ణారెడ్డి, చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్‌ను పూర్తిచేశారు. కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో కలెక్టరేట్‌లో ఎన్‌ఐసీ హాల్లో ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి పోలింగ్‌ కేంద్రాల్లో ప్రిసైడింగ్‌ అధికారులు(పీఓ), ఏపీఓలను, ఓపీఓలను కేటాయించారు. రిజర్వ్‌ సిబ్బందిని కలుపుకొని జిల్లా పరిధి 8 సెగ్మెంట్లకు 16,536మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు.పీఓలు 4,076 మంది, ఏపీఓలు 3,968, ఓపీఓలు 7,952 మంది, మైక్రోఅబ్జర్వర్లు 540 మంది ఉన్నారు. పోలింగ్‌ సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్లతో ఏప్రిల్‌ 1, 2తేదీల్లో పీవోలకు, ఏపీవోలకు పోలింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు. ట్రైనింగ్‌లో ప్రొజెక్టర్‌, ఈవీఎంలు తప్పనిసరిగా వాడాలని సూచించారు. జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎన్‌ఐసీ అధికారి స్వర్ణలత, మ్యాన్‌పవర్‌ మేనేజ్మెంట్‌ నోడల్‌ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు తదితరులు పాల్గొన్నారు.

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. నీటి సమస్యపై ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 558 పంచాయతీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆనంతరం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో 40వేల టన్నుల ధాన్యం వస్తుందని, ధాన్యం కొనుగోలుకు 39 కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, భూపాల్‌రెడ్డి, పౌరసరపరాల శాఖ అధికారి రాథోడ్‌, డీసీఎస్వో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:52 PM