Share News

విమానంలో ప్రాణాలొదిలిన వృద్ధుడు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:54 PM

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం కొడుకుతో కలిసి వచ్చిన ఓ వృద్ధుడు చికిత్స తరువాత సొంతూరు వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం ఎక్కాడు.

విమానంలో ప్రాణాలొదిలిన వృద్ధుడు

చికిత్స కోసం నగరానికి.. వైద్యం పూర్తి

తిరిగి సొంతూరు వెళ్లే ఫ్లైట్‌ టేకాఫ్‌ సమయంలో సీటులోనే మృతి

శంషాబాద్‌, జనవరి 14 : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం కొడుకుతో కలిసి వచ్చిన ఓ వృద్ధుడు చికిత్స తరువాత సొంతూరు వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానం ఎక్కాడు. విమానం టేకా్‌ఫకు రెడీ అవుతుండగా సదరు వృద్ధుడు ఉన్నట్టుండి తలవాల్చాడు. శరీరంలో కదలిక లేకపోవడంతో వెంట ఉన్న వృద్ధుడి కుమారుడు విమాన సిబ్బందికి చెప్పడంతో ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రి వైద్యుడు వచ్చి చూసేసరికే వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై వృద్ధుడి కొడుకు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం దుర్గాపూర్‌నకు చెందిన వృద్ధుడు షేక్‌ నజ్రల్‌(62) ఇస్లాంకు కడుపులో ఇన్ఫెక్షన్‌ అయ్యింది. అతడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స అనంతరం తన కొడుకు ముజాహిద్‌తో కలసి సొంతూరు వెళ్లేందుకు శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కారు. విమానం టేకాఫ్‌ అవుతుండగా నజ్రల్‌ ఇస్లాం సీటులోనే ఒరిగిపోయాడు. భయపడిన అతడి కొడుకు వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చాడు. అప్పటికప్పుడు పరీక్షించే లోగానే నజ్రల్‌ మృతిచెందినట్టు వైద్యుడు నిర్ధారించాడు. చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్దామనుకున్న నజ్రల్‌ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated Date - Jan 14 , 2024 | 11:54 PM