Share News

ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:38 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా కృషిచేస్తానని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, పక్కన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు

జడ్పీ సర్వసభ్య సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా కృషిచేస్తానని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. గురువారం మద్గుల్‌ చిట్టంపల్లిలోని డీపీఆర్‌సీలో చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ వికారాబాద్‌ జిల్లా వారే కావడంతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజావసరాలను గుర్తించడం, అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని, వారు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వంలో ‘మన ఊరు-మన బడి’ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఎస్‌ఎంసీలు, సర్పంచ్‌లు, కాంట్రాక్టర్ల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. చేవెళ్ల-ప్రాణహిత-పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. రూ.200కోట్లతో అనంతగిరి కొండలను ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి సాగు నీరందిస్తూ పర్యాటకంతోనూ ఉపాధి కల్పిస్తామన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌తో హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని తెలిపారు. జడ్పీ భవన నిర్మాణానికి సీఎంతో మాట్లాడి నిధులను మంజూరు చేసేలా కృషిచేస్తానని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

పలు సమస్యలు లేవనెత్తిన ప్రజాప్రతినిధులు

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్‌ జడ్పీటీసీ డిమాండ్‌ చేశారు. బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్రలకు అమ్ముకున్నారన్నారు. మిల్లర్ల అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలతో సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పందింస్తూ... జిల్లాలో షార్ట్‌ఫాల్‌ లేదని, రాష్ట్ర అధికారుల బృందం తనిఖీల్లోనూ గుర్తించలేదన్నారు. బషీరాబాద్‌ మండల శివార్లు, పక్కనే ఉన్న కొడంగల్‌ నియోజకవర్గ శివార్లలో 2వేల ఎకరాల వరకు తెలంగాణ అటవీ భూముల్లో కర్ణాటక రైతులు ఆక్రమించారని బషీరాబాద్‌ జెడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. కలెక్టర్‌ కర్ణాటకలోని కలబురిగి కలెక్టర్‌తో చర్చించాలని కోరారు. యాలాల్‌లో డీసీఎంఎస్‌ దుకాణానికి ఎరువులు ఎందుకు సరఫరా చేయడం లేదని డీఏవో గోపాల్‌ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో విద్యుత్‌ ఇనుప స్తంభాలను ఎందుకు తొలగించడం లేదని విద్యుత్‌ ఎస్‌ఈ జయరాజ్‌ను ప్రశ్నించారు. దోమ మండలం రాపోల్‌, బ్రాహ్మణపల్లి తండా సర్పంచుల నుంచి ఎంబీ బుక్‌లు తీసుకుని నెలన్నర గడిచినా ఇంకా ఇవ్వడం లేదని జడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు. వారు తప్పు చేస్తే సస్పెండ్‌ చేయించాలి గానీ ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఎంబీలు, చెక్‌బుక్‌లు అధికారుల దగ్గర పెట్టుకుంటే చెల్లింపులు, పనులు నిలిచిపోతాయని, ఈ నెల 31వ తేదీలోగా పనులన్నింటికీ ఎంబీ రికార్డు చేయాలని డీపీవో తరుణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఏఈలు, డిప్యూటీ ఈఈలను ఆదేశించారు. మన ఊరు-మన బడి బిల్లులు ఇవ్వడం లేదని దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు. ఎంబీ రికార్డు చేయాలని కలెక్టర్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిధులు లేకున్నా మన ఊరు-మన బడి పనులు చేయించిందని, అందుకే ఏడాదిగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనని తాండూరు ఎమ్మెల్యే అన్నారు. ఏఈలు కరెంట్‌ స్తంభాలు అమ్ముకుంటున్నారని దౌల్తాబాద్‌ జడ్పీటీసీ తెలిపారు. ధారూరు, పరిగి, మర్పల్లి జడ్పీటీసీలు సుజాత, హరిప్రియ, మధుకర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో కిందికి వేలాడుతున్న వైర్లను సరిచేయడం లేదని, ట్రాన్స్‌ఫార్మర్లకు ఏబీస్విచ్‌లు బిగించడం లేదన్నారు. వెంటనే పరిష్కరించాలని స్పీకర్‌ ఆదేశించారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పనులకు రూ.10కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని, చెల్లించి ఆదుకోవాలని కోరారు. మర్పల్లి జడ్పీటీసీ మధుకర్‌ మాట్లాడుతూ.. కొంశెట్‌పల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌లో తుమ్మలపల్లిలో పదెకరాలు ఆక్రమణకు గురైందని, తుమ్మలపల్లిలో 500ఎకరాల్లో ఫాంల్యాండ్‌ ఏర్పాటు చేస్తున్నారని, రోడ్డును ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బషీరాబాద్‌ మండలంలో కర్ణాటక షేర్‌ మూల అనే ఫైనాన్షియర్లు మహిళలకు ఎక్కు వ వడ్డీకి రుణాలిస్తూ మోసగిస్తున్నారని ఎంపీపీ కరుణ తెలిపారు. ఎక్కువ వడ్డీకి రుణాలిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జిల్లాకు మంచి రోజులొచ్చాయి : జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

మన జిల్లాకు మంచి రోజులు వచ్చాయని, పార్టీలు ఏవైనా సరే మన జిల్లా నుంచి స్పీకర్‌, సీఎం ప్రాతినిథ్యం వహించడం జిల్లా ప్రజల అదృష్టమని, ఇందుకు తనకు సంతోషంగా ఉందని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ముందుకు సాగుదామని, ఆ దిశగా అందరూ కృషిచేయాలని అన్నారు. జిల్లాలో భూ సమస్యలు, ఇతర ప్రజాసమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషిచేయాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా జిల్లాకు త్వరగా నీరు తెచ్చి ఉభయ గోదావరి జిల్లాల మాదిరిగా పంటలతో కళకళలాడేలా తీర్చిదిద్దాలని కోరారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇసుక కొరతతో జల్లాలో ప్రభుత్వ పనులు నిలిచిపోయాయని, ఇసుక కేటాయించి పనులు సాగేలా చూడాలని సునీతారెడ్డి సూచించారు.

స్పీకర్‌, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం

జడ్పీ సమావేశానికి తొలిసారి హాజరైన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశానంతరం స్పీకర్‌, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, సీఈవో, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు శాలువాలు,పుష్పగుచ్ఛాలతో సన్మా నించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శ ర్మ, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు కోటాజీ, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు శేషగిరిశర్మ పాల్గొన్నారు.

నా కాన్వాయ్‌ వచ్చే సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలొద్దు : స్పీకర్‌

మర్పల్లి: తన కాన్వాయ్‌ వచ్చే సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించి ప్రజలను, వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. మర్పల్లి మండలం పంచలింగాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను ప్రజల మనిషినని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ఉన్న తమ నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. తాను వాహనంలో ప్రయాణించే సమయంలో పోలీసులు సాధారణ ట్రాఫిక్‌ను మళ్లించి, నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. తమ నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగొద్దని, అందుకే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించొద్దని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jan 11 , 2024 | 11:38 PM