Share News

హోటల్‌కు అడ్డుగా ఉన్నాయని..

ABN , Publish Date - May 31 , 2024 | 12:08 AM

పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం హరితహారం పథకంలో భాగంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోంది. ఈక్రమంలో కొందరు సొంత లాభం కొరకు రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను దర్జాగా నరికివేస్తున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

హోటల్‌కు అడ్డుగా ఉన్నాయని..
హిమాయత్‌ నగర్‌ హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై హోటల్‌ ముందు చెట్లను నరికివేసిన యాజమాన్యం

దర్జాగా చెట్లను నరికేసిన యాజమాన్యం

చోద్యం చూస్తున్న అధికారులు.. హరితహారానికి తూట్లు

మొయినాబాద్‌ రూరల్‌, మే 30: పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం హరితహారం పథకంలో భాగంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోంది. ఈక్రమంలో కొందరు సొంత లాభం కొరకు రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను దర్జాగా నరికివేస్తున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని హిమాయత్‌ నగర్‌ చౌరస్తా పరిధి పిస్తాహౌస్‌ సమీపంలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారికి ఆనుకొని ఓ వ్యక్తి పెద్ద హోటల్‌ నిర్మాణం చేపట్టాడు. ఈక్రమంలో హోటల్‌ ముందు ఏపుగా పెరిగిన చెట్లను అనుమతి లేకుండానే నరికేశాడు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు మాత్రం హోటల్‌ యజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. కొందరు పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హోటల్‌ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై చిలుకూరు ఏఈ రాజేష్‌ బాబును వివరణ కోరగా.. విద్యుత్‌ తీగలకు అడ్డుగా వచ్చిన చెట్లను మాత్రమే తొలగిస్తున్నామని, సదరు హోటల్‌ ముందు ఉన్న చెట్లను మాత్రం తమ సిబ్బంది తొలగించలేదని వివరించారు.

Updated Date - May 31 , 2024 | 12:08 AM