Share News

పెరిగిన పోలింగ్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 03 , 2024 | 12:07 AM

పెరిగిన పోలింగ్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక తెలిపారు.

పెరిగిన పోలింగ్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, మే 2 : పెరిగిన పోలింగ్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక తెలిపారు. వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్‌కు పెంచిన సమయం అందుబాటులో ఉంటుందని సూచించారు. వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఈసారి మాత్రం ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని భారత ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ సమయం పెంపు వల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకునేందుకు మరింత వెసులుబాటు లభించిందన్నారు. పెంచిన పోలింగ్‌ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని, ప్రతీ ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నికల సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకోవాలి

పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ శశాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందికి అన్ని నియోజకవర్గ (మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి సరూర్‌నగర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి సంబంధించి అత్తాపూర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో, చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో, పరిగి నియోజకవర్గానికి సంబంధించి పరిగిలోని నెంబర్‌ వన్‌ బాలుర ఉన్నత పాఠశాలలో, వికారాబాద్‌ నియోజకరర్గానికి సంబంధించి వికారాబాద్‌ లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో, తాండూర్‌ నియోజకవర్గమునకు సంబంధించి తాండూర్‌ సాయిపుర్‌ లోని నెంబర్‌ వన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో) కేంద్రాలలో సంబంధిత ఏఆర్‌వోలు ఏర్పాటు చేసిన ఓటర్‌ ఫెసిలిటీ సెంటర్లలో ఈ నెల 8వ తేదీ వరకు ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో విధుల్లో పాల్గొంటున్న 23వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును ఈ ఓటర్‌ ఫెసిలిటీ సెంటర్స్‌ ద్వారా వినియోగించుకోవాలని కలెక్టర్‌ శశాంక సూచించారు.

Updated Date - May 03 , 2024 | 12:07 AM