Share News

కొలిక్కి వచ్చిన కసరత్తు!

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:52 PM

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిక్షం బీఆర్‌ఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు లోక్‌సభా స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. కీలకమైన ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాల్‌గా మారిన విషయం తెలిసిందే.

కొలిక్కి వచ్చిన కసరత్తు!

రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు?

చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌.. మల్కాజిగిరి నుంచి శంభీపూర్‌ రాజు!

ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతులెత్తేయడంతో మారిన సమీకరణలు

మొన్నటి దాకా టికెట్‌ కోసం పోటీ..

ప్రస్తుతం అభ్యర్థులే కరువైన దైన్యంలో బీఆర్‌ఎస్‌..

ఎట్టకేలకు చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. చేవెళ్ల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును బరిలో దించాలాని గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే అధికార కాంగ్రెస్‌, బీజేపీల్లో టికెట్ల కోసం నేతలు పోటీపడుతుంటే మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌లు సైతం వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో సోమ, మంగళ వారాల్లో పార్టీ నేతలు విస్తృతంగా చర్చించి పోటీకి బరిలో నిలిపేందుకు జ్ఞానేశ్వర్‌, రాజుల పేర్లను ఖరారు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీల గాలి వీస్తోందని, బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసినా గెలవలేం అనే భయంతోనే చాలా మంది నేతలు కారు గుర్తుపై పోటీకి జంకుతున్నట్టు సమాచారం!

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రధాన ప్రతిక్షం బీఆర్‌ఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు లోక్‌సభా స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. కీలకమైన ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాల్‌గా మారిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎ్‌సలో చాలా మంది సీనియర్లే ఉన్నా చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నుంచి పోటీకి వారిలో ఎక్కువ మంది నేతలు ఆసక్తి చూపడంలేదు. చివరకు పార్టీ అధిష్ఠానం ఈ రెండు స్థానాల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమ, మంగళవారాలు వరుసగా రెండు రోజులు జరిగిన సమావేశాల్లో పార్టీ అధినాయకత్వం చేవెళ్ల, మల్కాజిగిరి అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. చేవెళ్ల అభ్యర్థిగా జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌, మల్కాజిగిరి అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే వీరిని పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి ఈ రెండు లోక్‌సభా స్థానాల పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు భారీగానే ఓట్లు లభించాయి. అయితే ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రె్‌సలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జడ్పీ చైర్‌పర్సన్లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. అలాగే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతున్నారు. క్షేత్రస్థాయిల్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటమి భయంతో పార్లమెంట్‌ స్థానాల నుంచి బరిలో దిగేందుకు సీనియర్‌ నేతలు సైతం వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక బీఆర్‌ఎ్‌సకు తలనొప్పిగా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగేందుకు సీనియర్లు ఆసక్తిచూపకపోవడంతో ఇటీవల ఓడిన కాంగ్రెస్‌ నేతలకు సైతం బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఫోన్‌చేసి మీకు అవకాశం కల్పిస్తామని, కారు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఎవరూ కూడా ఇందుకు ఆసక్తిచూపలేదు.

అసెంబ్లీ ఫలితాలతో పరిస్థితులు తలకిందులు!

ఇదిలా ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ ఈ రెండు లోక్‌సభ స్థానాల నుంచి కారు గుర్తుపై పోటీచేసేందుకు అనేక మంది నేతలు క్యూకట్టారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం పోటీకి నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ నాయకత్వం అవాక్కైంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే రంజిత్‌రెడ్డి పోటీకి దూరం కావడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలను ఆయన శాసించారు. కొన్ని విషయాల్లో అప్పటి మంత్రి సబితారెడ్డి కంటే పార్టీలో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ విషయంలో కొందరు పార్టీ ముఖ్యనేతల నుంచి అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయంలో కేటీఆర్‌ కూడా రంజిత్‌రెడ్డి వైపే ఉండడంతో సబితారెడ్డితో పాటు మరికొందరు నేతలు మౌనంగానే ఉండేవారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు, వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను రంజిత్‌రెడ్డికి అప్పగించారు. తాండూరు, వికారాబాద్‌, పరిగిల్లో పార్టీ ఓటమి పాలైంది. చేవెళ్లలో మాత్రం స్వల్పతేడాతో బయటపడింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల లోక్‌సభ స్థానంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరి క్షణంలో చేవెళ్ల బాధ్యతలను చూసుకోవాలని ఎమ్మెల్యే సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి చెప్పారు. ఆయన రంగంలో దిగడంతో అక్కడ పరిస్థితులు కొంత మారాయి. కారణాలేవైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రంజిత్‌రెడ్డి పార్టీకి కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల కింద బీఆర్‌ఎస్‌ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిని తానే అని ప్రకటించిన ఆయన ఇపుడు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పోటీకి ఆసక్తిచూపడం లేదు. అంతేకాక ఆయన కాంగ్రెస్‌, బీజేపీల వైపు చూస్తున్నట్లుగానూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం అభ్యర్థి ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది. అనేక మంది సీనియర్లు ఇపుడున్న రాజకీయ పరిస్థితులు కారణంగా పోటీకి ఆసక్తి చూపలేదు. దీంతో చివరకు ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌, సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పేర్లను పరిశీలించింది. అయితే సబితారెడ్డి కుటుంబం టికెట్‌ విషయం ముందుగా చెప్పి ఉంటే బరిలో దిగే వారం అని, ఇపుడు తక్కువ సమయం ఉండడంతో పోటీచేయడం కష్టం అని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో కాసాని జ్ఞానేశ్వర్‌ లేదా ఆయన తనయుడు వీరే్‌షలలో ఒకరిని పోటీ చేయాలని పార్టీ కోరింది. చివరకు మంగళవారం జరిగిన సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్‌ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. జ్ఞానేశ్వర్‌ ఎంపికలో సబితారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

మల్కాజిగిరిలో ఉద్యమ నాయకుడికి అవకాశం

ఇక మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలోనూ మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడి కోసం ముందుగానే ఖర్చీఫ్‌ వేసుకున్నారు. కానీ ఆయన ఇపుడు ఉన్న పరిస్థితుల్లో పోటీ చేయలేనని చేతులెత్తేశారు. మొన్నటి ఎన్నికలదాకా మేడ్చల్‌ జిల్లాకు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించిన మల్లారెడ్డి చివరకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీచేయడం లేదని ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ నాయకత్వం షాక్‌కు గురైంది. ఇటీవల మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీని తరువాత మల్లారెడ్డి కాంగ్రె్‌సకు దగ్గరయ్యే యత్నం చేశారు. అంతేకాక వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్‌ మళ్లీ అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. చివరకు కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును బరిలో దింపాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కేసీఆర్‌ కుటుంబం వెన్నంటి ఉండడంతో ఈ సారి ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు.

Updated Date - Mar 13 , 2024 | 12:11 AM