Share News

టెకీ సాగు అదుర్స్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:09 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలనగర్‌ మండలానికి చెందిన వెంకటరమణ(40) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోంతో రాత్రి పూట విధులు నిర్వహిస్తున్నాడు.

టెకీ సాగు అదుర్స్‌
మల్చింగ్‌ విధానంలో సాగవుతున్న పాలకూర

పదెకరాల్లో 25రకాల కూరగాయ పంటల సేద్యం

నెలకు రూ.4.50లక్షల వరకు ఆదాయం

సేద్యాన్ని లాభాల బాట పట్టించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

సేంద్రియ సాగుతో నాణ్యతగా ముందడుగు

ప్రత్యేకతను చాటుతున్న వెంకటరమణ

కష్టాల కడలిలో.. నష్టాల ఊబిలో ఎదురీదుతూ రైతులను కలవరపెడుతున్న వ్యవసాయాన్ని.. అవగాహనతో చేస్తే లాభాలు సాధ్యమే అని నిరూపిస్తున్నాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి కొత్తగా ఆలోచించి ఆచరణలో పెట్టి భేష్‌ అనిపించుకుంటున్నాడు వెంకటరమణ. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి పెట్టి సేంద్రియ సేద్యంతో నాణ్యత గల కూరగాయలను పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

షాద్‌నగర్‌, మార్చి 11 : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలనగర్‌ మండలానికి చెందిన వెంకటరమణ(40) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోంతో రాత్రి పూట విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయమంతా ఖాళీగా ఉండడంతో తనకిష్టమైన కూరగాయల సాగుపై ఆసక్తి చూపాడు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌లో 10గుంటల భూమి లీజుకు తీసుకొని సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించడం ప్రారంభించాడు. అది విజయవంతమై కొంత మేర లాభాలు ఆర్జించాడు. దీంతో మరింత ఉత్సాహంతో మరో 10ఎకరాలు లీజుకు తీసుకొని 25రకాల కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు ఎరుపు బెండ, తెల్ల బెండ, మూడు రకాల వంకాయలు, మూడు రకాల టమాటాలు, బీర, దోస, బీన్స్‌, చిక్కుడు, సొరకాయ, ఆలుగడ్డ, క్యాబేజి, మిరప, పుచ్చకాయ, బొప్పాయి, ముల్లంగి, కాకర, పొట్లకాయ, బీట్రూట్‌, గోరు చిక్కుడు తదితర కూరగాయలు, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, తోటకూర, ఎరుపు తోటకూర, పాయిల్‌ కూర, పుదీన తదితర ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. ఈ పంటలన్నీ ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే సాగుచేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. నాణ్యమైన, ఆరోగ్యకర కూరగాయలు వినియోగదారులకు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే పదెకరాల్లోనూ కేవలం ఒకే ఒక్క బోరుతో బిందుసేద్యంతో లీజు తీసుకున్న భూమినంతటినీ సాగు చేస్తుండడం గమనార్హం.

చేను వద్దకే చిరు వ్యాపారులు!

ఇక వెంకటరమణ కృషి గురించి చెప్పుకుంటే మొదట రూ.35 లక్షలతో సాగును ప్రారంచాడు. ప్రతీరోజూ 500 కిలోల వరకు కూరగాయలను మార్కెటింగ్‌ చేసి రోజుకు రూ.15వేల చొప్పున నెలకు 4.5లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించాడు. కూరగాయల చిరు వ్యాపారులు హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇతడి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి హోల్‌సేల్‌గా కొనుక్కొని వెళ్తారు. దీంతో వెంకటరమణకు కూరగాయల లోడ్‌ను మార్కెట్‌కు తరలించే ఖర్చులు సైతం తప్పాయి. ఈయన అన్ని రకాల పంటలను పండిస్తున్నందున కొన్ని కూరగాయలకు ధరలు లేకున్నా ధర ఉన్న వాటితో నష్టాన్ని పూడ్చుకుంటాడు. ఈ విధానమే ఓ రకంగా అతడి విజయ రహస్యంగా చెప్పవచ్చు. సాగు చేసిన పంటలు త్వరగా చేతికందేలా ఆధునిక సాగు పద్ధతులు అవలంభిస్తాడు. పంట తొందరగా చేతికంది రోజు వారీ ఆదాయం పెరగడమే తప్ప తరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇతడి భార్య కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగే. వారికి ఇద్దరు సంతానం. భార్య, పిల్లలు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నా వెంకటరమణ వర్క్‌ ఫ్రంహోంతో అటు ఉద్యోగం, ఇటు వ్యవయాసం రెండూ చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా : వెంకటరమణ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ప్రతీదీ కల్తీ అవుతున్న ఈ రోజుల్లో ప్రజారోగ్యం దృష్ట్యా నాణ్యమైన కూరగాయలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతోనే సేంద్రియ సాగులోకి దిగాను. విత్తనాలు వేసి నెలలకొద్దీ పంట కోసం వేచి చూడటం నాకు ఇష్టం లేదు. మల్చింగ్‌, అండర్‌ రూఫ్‌, గ్రీన్‌ హౌస్‌ తదితర ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తూ ఆర్జిస్తున్నాను. ఒకపక్క ఉద్యోగంతో చేస్తూనే నాకిష్టమైన రంగాన్ని ఎంచుకొని దానిలో విజయవంతం కావడం సంతోషంగా ఉంది.

Updated Date - Mar 12 , 2024 | 12:27 AM