Share News

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:13 AM

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దంపతుల కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ బంధువులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలో భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా..

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడుతున్న పోలీసులు

మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దంపతులు

కారు ఢీకొనడంతో అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృతి

న్యాయం చేయాలని చేవెళ్లలో పెద్దఎత్తున ఆందోళన

చేవెళ్ల, మార్చి 15(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దంపతుల కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ బంధువులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలో భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త ఉస్మానియా ఆసుప్రతిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈమేరకు వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. షాబాద్‌ మండలం బొబ్బిలిగామకు చెందిన ఆవుల మల్లేష్‌(40) నవనీత(32) భర్యాభర్తలు. గురువారం ఇంటి నుంచి బైక్‌పై చేవెళ్లకు వెళ్తున్న క్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో నవనీత అక్కడికక్కడే మృతిచెందగా.. మల్లేష్‌ రక్తగాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజమున మృతిచెందాడు. మల్లేష్‌ మృతదేహాన్ని ఉస్మానియా నుంచి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని శివ నుంచి పరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి నుంచి చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నార్సింగ్‌ ఏసీపీ రమణగౌడ్‌, రాజేంద్రనగర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీ్‌సలు పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. అనంతరం పోలీ్‌సలు వారిని బలవంతంగా పోలీ్‌సస్టేషన్‌కు తరలించి సముదాయించారు. కారు యాజమానితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని, మృతదేహాలను తీసుకెళ్లాలని పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. అనంతరం శివతో ఫోన్‌లో మాట్లాడారు. మృతుల ఇద్దరు పిల్లలకు పూర్తి న్యాయం చేస్తామని కారు యాజమాని తరఫున బొబ్బిలిగామ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, పోలీ్‌సలు భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించి మృతదేహాలను తీసుకెళ్లారు.

అనాథలైన ఇద్దరు పిల్లలు

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కూతురు మనస్వి 8వ తరగతి, కుమారుడు యశ్వంత్‌ 4వ తరగతి షాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. కాగా, అమ్మానాన్న కావాలంటూ ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది.

Updated Date - Mar 16 , 2024 | 12:13 AM