Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:57 PM

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.సుదర్శన్‌ వెల్లడించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం
మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్‌

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.సుదర్శన్‌ వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలోని భారత్‌ గార్డెన్స్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్న సీపీఎం జిల్లా పదవ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహాయిస్తే ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదని ఆరోపించారు. రైతు బంధును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను లాక్కోవడం అన్యాయమని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ మాట్లాడుతూ పెరిగిన ధరలకనుగుణంగా అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడంతో కూలీలకు పనులు కల్పించడంలో సమస్య ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాలపట్ల చిన్నచూపు చూస్తున్నాయన్నారు. వీరి చర్యలు కార్పొరేట్‌, ధనిక వర్గాలకు లాభం చేకూర్చేలా ఉన్నాయన్నారు. రామోజీ ఫిలిం సిటీ వద్ద గతంలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి వెంటనే స్థలాలు చూపి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌ మాట్లాడుతూ షాబాద్‌, చందన్‌వెల్లి నుంచి పారే ఫిరంగి కాలువ అనేక చోట్ల కబ్జాకు గురైందని, హైడ్రా కమిషనర్‌ స్పందించి కాలువ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, భూపాల్‌, జిల్లా నాయకులు పగడాల యాదయ్య, బి.మధుసూదన్‌రెడ్డి, బి.సామేల్‌, డి.జగదీశ్‌, కవిత, సీ.హెచ్‌.బుగ్గరాములు తదితరులున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:57 PM