Share News

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 31 , 2024 | 11:52 PM

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి రైతులను మోసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎరువుల విత్తనాల వ్యాపారులు రాష్ట్ర వ్యవసాయ శాఖ నిబంధనలకు లోబడి విక్రయాలు చేపట్టాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
మల్కీజ్‌గూడలో ఎరువులు దుకాణంలో తనిఖీ చేస్తున్న ఏసీపీ కేపీవీ రాజు

కృత్రిమ కొరత సృష్టించొద్దు : ఏసీపీ కేపీవీ రాజు

యాచారం, మే 31 : నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి రైతులను మోసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎరువుల విత్తనాల వ్యాపారులు రాష్ట్ర వ్యవసాయ శాఖ నిబంధనలకు లోబడి విక్రయాలు చేపట్టాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో యాచారం, మాల్‌, మల్కీజ్‌గూడ గ్రామాలలో అధికారులు ఎరువులు, విత్తనాల దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దుకాణదారులు రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించిన వెంటనే బిల్లు రసీదు ఇస్తున్నారా? లేదా? స్టాక్‌ రిజిస్టర్‌లు మొయింటెన్‌ చేస్తున్నారా? విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఏసీపీ మాట్లాడుతూ ఎరువులు లూజ్‌గా విక్రయించరాదని దుకాణాదారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఎరువుల విక్రయించరాదని దుకాణాదారులను ఆదేశించారు. ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రతీరోజు స్టాక్‌ చూసి ఎరువులు తెప్పించుకోవాలని సూచించారు. మారుమూల గ్రామాలలో బ్లాక్‌లో ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతీ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కాగా, మాల్‌ వద్ద నేడు(శనివారం) చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తామని, నకిలీ విత్తనాల తరలింపుపై నిఘా పెట్టనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి జీఎస్‌ సందీ్‌పకుమార్‌, సీఐ శంకర్‌కుమార్‌, ఎస్సై వెంకటనారాయణ, ఆర్‌ఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:52 PM