ఆపదలో ఆపన్న హస్తం
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:05 AM
విద్యుత్తు వైరు తెగిపడి రెండు పాడి ఆవులు మరణించడంతో మనోవేధనకు గురైన రైతు బాధను తీర్చారు ఇద్దరు దాతలు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రంగంపల్లి శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ వైరు తెగిపడి జవాజీ లింగంయాదవ్ అనే రైతుకు చెందిన రెండు సంకరజాతి పాడి ఆవులు చనిపోయాయి.
రైతుకు పాడి ఆవులు దానం చేసిన
బక్కని నర్సింహులు, నందారం అశోక్‌యాదవ్
షాద్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 27: విద్యుత్తు వైరు తెగిపడి రెండు పాడి ఆవులు మరణించడంతో మనోవేధనకు గురైన రైతు బాధను తీర్చారు ఇద్దరు దాతలు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రంగంపల్లి శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ వైరు తెగిపడి జవాజీ లింగంయాదవ్ అనే రైతుకు చెందిన రెండు సంకరజాతి పాడి ఆవులు చనిపోయాయి. తనకున్న పది గుంటల వ్యవసాయ భూమిని అమ్ముకుని పాడిపశువుల పోషణను చేపట్టి జీవనోపాధి పొందుతున్న లింగంయాదవ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, చటాన్‌పల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు నందారం అశోక్‌యాదవ్‌లు స్పందించారు. అశోక్‌యాదవ్ తమిళనాడు నుంచి రూ.90వేలతో జెర్సీ ఆవును తెప్పించగా.. తన ఇంటి వద్ద ఉన్న ఆవుల్లో రూ.లక్ష విలువ గల జెర్సీ ఆవుకు బక్కని నర్సింహులు పూజ చేసి లింగంయాదవ్‌కు ఇచ్చారు. మాజీ జడ్పీటీసీలు పి. వెంకట్‌రాంరెడ్డి, విశాలశ్రవణ్‌రెడ్డిలు రూ.5వేల చొప్పున, ప్రముఖ కాంట్రాక్టర్ ఎన్నం గోపాల్‌రెడ్డి రూ.5వేలు, రంగంపల్లి గ్రామస్థులు, ఇతరులు రూ.7వేలు బాధిత రైతుకు ఇచ్చారు. టీడీపీ నాయకుడు లింగారం కుమార్‌గౌడ్, ఇన్ముల్‌నర్వ మాజీ సర్పంచ్ అజయ్ మిట్టునాయక్‌లు పాల్గొన్నారు.