Share News

పరిషత్‌లలో ‘ప్రత్యేక’ పాలన షురూ!

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:21 AM

జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన షురూ అయింది.

పరిషత్‌లలో ‘ప్రత్యేక’ పాలన షురూ!
యాచారం మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పద్మజ రమణి

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారులు

ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత

బీసీ కులగణన తర్వాతే నిర్వహణ?

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూలై 4 : జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన షురూ అయింది. మండల, జిల్లా పరిషత్‌ సభ్యుల పదవీకాలం ముగియడంతో ’ప్రత్యేక‘ అధికారుల పాలనకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో గురువారం ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లు అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రజల ఓట్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఎన్నికై ఐదేళ్ల పాటు సేవలు అందించిన సభ్యులు ఇక నుంచి ’మాజీ‘లు అయ్యారు. పాలనా వ్యవహారాల్లో ఇకపై వారి జోక్యం ఉండబోదు. మండల, జిల్లా పరిషత్‌లకు వచ్చే నిధులు ఖర్చు, ఇతర పాలనాపరమైన అంశాలను మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు కేటాయించిన అధికారులే పర్యవేక్షిస్తారు. జిల్లాలో 21 మండల పరిషత్‌లు, 257 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 21 మంది ఎంపీపీలు, 21 మంది జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పాలక వర్గాల నిర్ణీత గడువు కంటే రెండు నెలలు ముందుగానే అప్పటి ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది. కానీ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వీటి నిర్వహణకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడక పోవడంతో సర్పంచ్‌ల తరహాలోనే ప్రత్యేకాధికారుల పాలన అందుబాటులోకి వచ్చింది.

‘పొడిగింపు’పై ఆశలు గల్లంతు

తమ పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగిస్తారని భావించిన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తమ పదవీకాలాన్ని పెంచుతారని సభ్యులు భావించారు. కానీ ప్రభుత్వం ఎలాంటి పొడిగింపు ఇవ్వకుండా ’ప్రత్యేక‘ పాలనకే మొగ్గుచూపింది. పదవీకాలాన్ని పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌ సభ్యుల నుంచి ప్రభుత్వానికి వినతులు సైతం వెళ్లాయి. ఇప్పట్లో ఎన్నికలు లేనందున తమను మరికొంత కాలం కొనసాగించాలంటూ విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. కానీ ప్రభుత్వం వాటిని లెక్కలోకి తీసుకోలేదు.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..

ప్రత్యేక అధికారులను నియమించడంతో మండల, జిల్లా పరిషత్తులతో పాటు సర్పంచు స్థానాలకు సైతం ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. సర్పంచుల పద వీకాలం జనవరి నెలలో ముగియగా ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. రాష్ట్రంలో అప్పుడే కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సమయం లేకపోవడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగు వేయలేదు. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించాలని భావించగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదే క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం దగ్గరపడినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెళ్లలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావడం, రాజకీయంగా కొంత అస్థిరత ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అధికార కాంగ్రెస్‌ భావించింది. దీనితో పాటు రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మార్పు, బీసీ కుల గణన వంటి అంశాలు ఎన్నికలను వాయిదా వేయడానికి కారణంగా మారాయి.

Updated Date - Jul 05 , 2024 | 12:21 AM