మండల పరిషత్తుల్లో కొలువుదీరిన ప్రత్యేకాధికారులు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:23 AM
మండల ప్రజా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఈనెల 3వ తేదీన మండల పరిషత్తు పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.

వికారాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఈనెల 3వ తేదీన మండల పరిషత్తు పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ మండలానికి జడ్పీ సీఈవో ఎం.సుధీర్‌ను నియమించగా, ధారూరు మండలానికి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కె.మల్లేశం, కోట్‌పల్లి మండలానికి ముఖ్య ప్రణాళికాధికారి అశోక్, మర్పల్లి మండలానికి జిల్లా సహకార అధికారి ఈశ్వరయ్య ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. బంట్వారం మండలానికి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అఽధికారి శంకర్ నాయక్, మోమిన్‌పేట్ మండలానికి జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, పరిగి మండలానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, దోమ మండలానికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంతరావు, కులకచర్ల మండలానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూ మోజెస్, పూడూరు మండలానికి జిల్లా పంచాయతీ అధికారి జయసుధలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. కొడంగల్ మండలానికి జిల్లా అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్, దౌల్తాబాద్ మండలానికి పశుసంవర్ధక శాఖ ఏడీ సదానందం, బొంరాస్‌పేట్ మండలానికి సర్వే, ల్యాండ్ రెవెన్యూ ఏడీ ఎం.రాంరెడ్డి, తాండూరు మండలానికి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ఎంఏ సత్తార్, పెద్దేముల్ మండలానికి గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, యాలాల్ మండలానికి మార్కెటింగ్ ఏడీ సారంగపాణి, బషీరాబాద్ మండలానికి జిల్లా ఆడిట్ అధికారి వీరభద్రరావు, నవాబ్‌పేట్ మండలానికి జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌లను నియమించారు. మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం బుధవారం ముగియడంతో మండలాలకు నియమించిన ప్రత్యేకాధికారులు గురువారం బాధ్యతలు చేపట్టారు. కాగా, జిల్లా ప్రజాపరిషత్తు పాలక వర్గం పదవీ కాలం గురువారం ముగియగా, పాలక వర్గం స్థానంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడితే శుక్రవారం జిల్లా కలెక్టర్ జడ్పీప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. పాలకవర్గాలకు ఉండే అధికారాలన్నీ ప్రత్యేకాధికారులకు ఉంటాయి. నిధుల కేటాయింపు, పనుల ఎంపిక తదితర వ్యవహారాలను ప్రత్యేకాధికారులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. పట్నం సునీతారెడ్డి వరుసగా మూడు పర్యాయాలు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై హాట్రిక్ సాఽధించారు. రెండు పర్యాయాలు రంగారెడ్డి జిల్లా నుంచి, ఒకసారి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.