Share News

ప్రశాంతతకు నిలయం కన్హా శాంతివనం

ABN , Publish Date - May 26 , 2024 | 11:59 PM

కన్హా శాంతివనం ఆధ్యాత్మికతకు కేంద్రమని, మానసిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తోందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ అన్నారు.

ప్రశాంతతకు నిలయం కన్హా శాంతివనం
కన్హా శాంతివనంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ దంపతులు

శాంతివనం ఓ ఆధ్యాత్మికతకు కేంద్రం

రామచంద్రమిషన్‌ సేవలు ప్రశంసనీయం

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌

ట్రీ కన్జర్వేషన్‌, టిష్యూ ల్యాబ్‌లను పరిశీలించిన ముఖ్యమంత్రి

నందిగామ/శంషాబాద్‌ రూరల్‌, మే 26 : కన్హా శాంతివనం ఆధ్యాత్మికతకు కేంద్రమని, మానసిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తోందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం నందిగామ మండల పరిధిలోని కన్హాశాంతివనాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శాంతివనంలోని ట్రీ కన్జర్వేషన్‌, టిష్యూ ల్యాబ్‌, హరితహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో అంతరించిపోతున్న మొక్కలు, చెట్లను కాపాడుకునేందుకు ఆధునిక కణజాల సంస్కృతి కేంద్రంగా ట్రీ కన్జర్వేషన్‌ సెంటర్‌, టిష్యూ కల్చర్‌ ల్యాబొరేటరీలు దోహదంచేస్తాయన్నారు. వీటి ద్వారా అంతరించిపోతున్న పురాతన వృక్ష జాతులను పరిరక్షించే అవకాశం ఉందన్నారు. ఈ ఆధునిక విధానంతో ఉపాధిని సృష్టించి వ్యవసాయంలోనూ విప్లవాత్మక మార్పులు తేవచ్చన్నారు. రామచంద్రమిషన్‌ సేవలు ప్రశంసనీయమన్నారు. ఆశ్రమంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కన్హాశాంతివనం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆధ్యాత్మికతకు కేంద్రమన్నారు. కన్హాశాంతివనాన్ని సందర్శించినప్పుడు ప్రకృతిని తాకిన అనుభూతి పొందానని, ప్రకృతి అందాలను రక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి చేపడుతున్న గొప్ప కార్యక్రమాలను వీక్షించాలని కోరారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థతో కలసి రాష్ట్రంలో వేల ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టిందని, హరిత విప్లవానికి సంయుక్తంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ శనివారం రాత్రి కుటుంబసభ్యులతో కలసి కన్హాశాంతివనానికి చేరుకున్నారు. ఆయన వెంట రాంచంద్రమిషన్‌ ప్రతినిధులు ఉన్నారు.

చిన జీయర్‌ ఆశీస్సులు తీసుకున్న సీఎం

శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో త్రిదండి చినజీయర్‌ స్వామిని మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌, ఆయన కుటుంబీకులు శనివారం రాత్రి కలిసి ఆశీస్సులు పొందారు. అంతకుముందు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య దేశాలు, సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి పూజలు నిర్వహించారు. మూడు గంటలకుపైగా సీఎం, కుటుంబ సభ్యులు స్ఫూర్తి కేంద్రంలో గడిపారు. సీఎంకు చిన జీయర్‌స్వామి సమతామూర్తి ప్రతిమను, మంగళాశాసనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎంను శాలువా కప్పి సత్కరించారు.

Updated Date - May 26 , 2024 | 11:59 PM