Share News

కుంగుతున్న కల్వర్టు.. పొంచి ఉన్న ప్రమాదం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:40 PM

కొద్ది రోజులుగా మేడ్చల్‌ మండలంలో కురుస్తున్న అడపాదడపా వర్షాలకు డబిల్‌పూర్‌-నూతన్‌కల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగిపోయింది. ఫలితంగా వాహనదారులు భయపడుతూ కల్వర్టు దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

కుంగుతున్న  కల్వర్టు.. పొంచి ఉన్న ప్రమాదం

కొద్ది రోజులుగా మేడ్చల్‌ మండలంలో కురుస్తున్న అడపాదడపా వర్షాలకు డబిల్‌పూర్‌-నూతన్‌కల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగిపోయింది. ఫలితంగా వాహనదారులు భయపడుతూ కల్వర్టు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. కల్వర్టు కుంగి కల్వర్టు పక్క పెద్ద గుంతలు ఏర్పడటంతో స్థానికులు రోడ్డుకు ఒకవైపు హెచ్చరికగా రెడ్‌ బారికేట్‌ను ఏర్పాటుచేశారు. సంబంధిత అధికారులు మాత్రం కల్వర్టు మరమ్మతు గురించి పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజులుగా కల్వర్టు రోజుకింత కుంగుతుండటంతో పెద్ద వాహన దారులు రోడ్డుపై ప్రయాణించటానికి జంకుతున్నారు. డబిల్‌పూర్‌-నూతన్‌కల్‌ గ్రామాలకు మధ్య ఉన్న ఇస్కాన్‌ ఆలయం వద్ద వర్షపు నీరు సమీపంలోని చెరువు కుంటలో చేరటానికి ఈ కల్వర్టును ఏర్పాటు చేశారు. అయితే, కాంట్రాక్టర్‌ నాణ్యత లేకుండా నిర్మించడంతో కల్వర్టు కుంగిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, నిత్యం వందల వాహనాలు నడిచే రోడ్డుపై నిర్మించిన కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని నూతన్‌కల్‌, డబిల్‌పూర్‌ గ్రామస్తులు కోరుతున్నారు.

- మేడ్చల్‌ టౌన్‌, జూన్‌ 8

Updated Date - Jun 08 , 2024 | 11:40 PM