Share News

మతి తప్పి మాట్లాడుతున్న సబితారెడ్డి

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:03 AM

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

మతి తప్పి మాట్లాడుతున్న సబితారెడ్డి

డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 5 : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి కనీసం నెల కూడా కాలేదని, అప్పుడే కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఎక్కడ? అని సబితారెడ్డి ప్రశ్నించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఐదేళ్ల పాలనలో నువ్వు ఇస్తా అన్న దళిత బంధు, బీసీ బంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఎక్కడ? ఆని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సబితారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలని చల్లా తెలిపారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ కమిటీలన్నీ రద్దు

మహేశ్వరం, జనవరి 5 : మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ డివిజన్‌లలోని తమ పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అద్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమారర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మాఎడ్డి సూచన మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీకి సంబందించిన అన్ని కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా ఎవరైనా నేను ఫలానా అధ్యక్షున్ని అని ప్రచారం చేసుకునే వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం పార్టీకోసం పనిచేసేవారిని గుర్తించి త్వరలో తగిన ప్రాధాన్యతనిస్తూ కమిటీలు వేస్తామని ప్రకటించారు

Updated Date - Jan 06 , 2024 | 12:03 AM