Share News

పల్లె ప్రగతి పనులు భేష్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:45 PM

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు భేషుగ్గా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది.

పల్లె ప్రగతి పనులు భేష్‌
కడ్తాల రైతు వేదిక వద్ద సిక్కిం బృందం

సిక్కిం గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధుల బృందం కితాబు

కడ్తాల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ): పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు భేషుగ్గా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది. అలాగే కడ్తాల గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల రూపకల్పన, ప్రగతిని వారు ప్రశంసించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో పంచాయతీల పనితీరుపై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణలో పాల్గొనడానికి వచ్చిన సిక్కిం బృందం గురువారం కడ్తాల గ్రామ పంచాయతీలో పర్యటించింది. టీం కో-ఆర్డినేటర్‌ జరీనా నేతృత్వంలోని సభ్యులు కడ్తాల రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, స్వయం సహాయక సంఘాల దుకాణాలు, పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. అభివృద్ధి పనులకు చేసిన ఖర్చు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో, ప్రత్యేక అధికారి సుజాత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహ్మారెడ్డి, ఎంపీవో విజయ్‌పాల్‌, ఐకేపీ ఏపీఎం రాజేశ్వరీదేవి, మహిళాపొదుపు సంఘాల సభ్యులు, నాయకులు లాయక్‌అలీ, మూడ అశోక్‌, చేగూరి మహేశ్‌, క్యామ వెంకటేశ్‌, ఉపేందర్‌, మహేశ్‌, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:45 PM