Share News

శిశువు కిడ్నాప్‌ కేసును ఛేదించిన ఆర్జీఐఏ పోలీసులు

ABN , Publish Date - May 31 , 2024 | 11:48 PM

నెల రోజుల పసిపాప కిడ్నాప్‌ కేసును శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డీసీపీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. చిన్నా-లక్ష్మి అనే దంపతులు శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ శంషాబాద్‌లోని హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద రాత్రివేళ పడుకుంటారు.

శిశువు కిడ్నాప్‌ కేసును ఛేదించిన ఆర్జీఐఏ పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

శంషాబాద్‌, మే 31 : నెల రోజుల పసిపాప కిడ్నాప్‌ కేసును శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డీసీపీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. చిన్నా-లక్ష్మి అనే దంపతులు శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ శంషాబాద్‌లోని హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద రాత్రివేళ పడుకుంటారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కూతురుకు ఐదేళ్లు ఉండగా.. చిన్న కూతురుకు నెల రోజుల క్రితం జన్మనిచ్చారు. ఈక్రమంలో మే 27న దంపతులు నిద్రిస్తుండగా.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ముగ్గురునిందితులు.. దండు హనుమంతు అతడి భార్య చందన సమీప బంధువు స్వాతిలు చిన్నా-లక్ష్మిల నెలరోజుల శిశువును కిడ్నాప్‌ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ఈమేరకు శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పసికందును పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టారు. టెక్నికల్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ముగ్గురు నిందితులు ఆ పసికందును విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు శంషాబాద్‌ సమీపంలో పట్టుకున్నారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. అడిషనల్‌ డీసీపీ రాంకుమార్‌, ఏసీపీ కేఎస్‌ రామారావు, సీఐ బాలరాజ్‌, డీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు అప్పారావు, మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:48 PM