Share News

ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - May 22 , 2024 | 11:34 PM

పట్టణంలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌ ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న అనురాధ పత్యనాయక్‌

జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌

ఆమనగల్లు, మే 22 : పట్టణంలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డీవో కార్యాలయం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఆమనగల్లు పట్టణంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆమనగల్లు పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు ఏళ్ల కాలంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నా.. ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలను కలిపి ఆమనగల్లులో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు సాధన కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం అందుబాటులో లేక రైతులు, ప్రజలు దూర, ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని, గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాలతో పాటు 2016లో కొత్తగా ఏర్పాటు చేసిన కడ్తాల మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాలను కందుకూరు, మాడ్గులను ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం పరిధిలోకి చేర్చడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలో కార్యాలయాలు అందుబాటులో లేక ఏళ్లకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, పాలక ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈవిషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాలతో కలిసి రాజకీయాలకతీతంగా ఆర్డీవో కా ర్యాలయం ఏర్పాటుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అనురాధపత్యనాయక్‌ అన్నారు. నాయకులు ఉప్పల రాములు, డేరంగుల వెంకటేశ్‌, రమేశ్‌నాయక్‌, ఆనంద్‌, కృష్ణవేణి, గణేశ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 11:34 PM