Share News

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:46 PM

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ బయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
షాబాద్‌ : ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు

విద్యార్థులతో కలిసి సర్కారు స్కూళ్లలో ప్రవేశాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు

కొత్తూర్‌, జూన్‌ 6: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ బయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో అరుంధతి, ఎంఈవో కిష్టారెడ్డి, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగోర్‌నాయక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేశంపేట : బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని కేశంపేట ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మండలం పరిధిలోని కొత్తపేట గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ఆయన ఇన్‌చార్జి ఎంఈవో మనోహర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పౌరుడు చదువుకోవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వివరించారు. 5 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చంద్రశేఖర్‌, ఏపీఎం భగవంతు, పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌, పీఆర్‌టీయూ మండలశాఖ అధ్యక్షుడు శ్రీనివాస సాగర్‌, ఉపాధ్యాయులు సాయిప్రసాద్‌, అబ్ధుల్‌ బారీ, శిరీష, సుజాత, పీఈటీ శిరీష, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎన్‌. జ్యోతి, జె. జ్యోతిలో పాల్గొన్నారు.

షాద్‌నగర్‌ రూరల్‌ : చదువుతోనే మనిషికి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని ఎంపీడీవో బన్సీలాల్‌ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ ఉన్నత పాఠశాలలో ఉసాధ్యాయులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను తల్లీదండ్రులు విధిగా పాఠశాలకు పంపించాలని సూచించారు. అలాగే మైనర్లను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్‌ రాథాడ్‌, హెచ్‌ఎంలు జయమ్మ, కృష్ణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చౌదరిగూడ : బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల పరిధిలోని జిల్లేడ్‌లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యను, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విధానాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపించకుండా చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బాబురావు, చౌదరిగూడ ఇన్‌చార్జీ హెచ్‌ఎం విల్సన్‌ సునీల్‌, పాఠశాల హెచ్‌ఎం పతంజలి, పడకంటి వెంకటేష్‌, రఘు అంగన్‌వాడీ టీచర్‌ అనీ్‌షబేగం, పంచాయతీ కార్యదర్శి సమత, విద్యార్థులున్నారు.

షాబాద్‌ : ఫ్రైవేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయని మండల నోడల్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయని, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేదవిద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అయితే ఇంటర్‌, డిగ్రీ చదివిన వారే పాఠాలు బోధిస్తారని, ప్రభుత్వ పాఠశాలల్లో బీఈడీ చదివిన వారు బోధిస్తారన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోవిందు, యామిని, హనుమంతు, ప్రశాంత్‌, లక్ష్మి, హీన, ఉపాధ్యాయులు నర్సింహులు, సీఆర్పీ లింగం, పంచాయతీ కార్యదర్శి అనిత, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం : బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్‌ తల్లిదండ్రులను కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాయపోల్‌ గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లోనే చక్కటి విద్యాభోదన, నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. మధ్యాహ్న భోజ నం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఉచి తంగా అందిస్తుందన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాస్‌, ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు పద్మ, ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

మంచాల : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్య బోధించబడుతుందని విద్యాశాఖ జిల్లా అధికారి కృష్ణయ్య, ఎంఈవో వెంకట్‌రెడ్డిలు అన్నారు. మంచాల, నోములలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్య ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని చెప్పారు. ఏఎంవో వెంకటేష్‌, నోడల్‌ అధికారి రాందాస్‌, ఆదర్శపాఠశాల చైర్మన్‌ నవనీత, ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగప్ప, ఉపాధ్యాయులు బాలూనాయక్‌, నవనీత, విజయ్‌కుమార్‌, బాలరాజు, ఐల య్య తదితరులు పాల్గొన్నారు.

ఆదిభట్ల : బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆదిభట్ల ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమం విజయవంతం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆదిభట్ల ఉన్నత, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు బుచ్చయ్య, పరమేష్‌, ఉపాధ్యాయులు అశోక్‌, రామ్మోహన్‌, జంగయ్య, విజయలక్ష్మి, బబ్లీ, ఇందిరాదేవి, చైర్మన్‌ మమత, వీవో సభ్యులు మాధురి, అంగన్‌వాడీ టీచర్లు బేబీ, సుజాత పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య, మౌళిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు అందుతాయని ఎంపీడీవో సరిత అన్నారు. మండలంలోని లేమూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడు ఎ.నర్సింహతో కలిసి బడిబాట ర్యాలీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాభోధనలు ఉంటుందన్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని తల్లిదండ్రుకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌, సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:46 PM