Share News

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:02 AM

ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు రూ.10 లక్షలు ప్రభుత్వం సాయమందిస్తుందని పేర్కొన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ఫిబ్రవరి 29: ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు రూ.10 లక్షలు ప్రభుత్వం సాయమందిస్తుందని పేర్కొన్నారు. ఆమనగల్లు, కడ్తాల, వెల్దండ మండలాల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భర్కత్‌పల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ బీరయ్యకు వైద్య చికిత్సలకు మంజూరైన రూ.2.50 లక్షలు ఎల్వోసీని నగరంలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా ఆందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదునీకరించి రోగులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు పెంచి ఆదునాతన భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి అన్ని విధాలా చేయూతనందించడం జరుగుతుందని కసిరెడ్డి తెలిపారు. ఈజీఎస్‌ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరైనట్లు ఆయన వివరించారు. త్వరలో బీటీ రోడ్లు లేని అన్ని మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. కేఎల్‌ఐ డీ-82 కాల్వ అసంపూర్తి పనులు పూర్తి చేయించి రైతులకు సాగునీరందించడం తో పాటు నిర్వాసితులకు పరిహారం అందించాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు కసిరెడ్డి తెలిపారు. అభివృద్దిలో రాజకీయాలకు చోటు లేకుండ ప్రజలంత పాలు పంచుకోవాలని కోరారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, వెంకటయ్య, జగన్‌, బాబా, విజయ్‌రాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:02 AM