Share News

మొండిగౌరెల్లిలో క్వారీలు, క్రషర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:57 PM

మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్‌ 19లో క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కంటైనర్‌తో పాటు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసేందుకు క్యారీలు, క్రషర్ల యజమానులు చకచకా పనులు సాగిస్తున్నారు.

మొండిగౌరెల్లిలో క్వారీలు, క్రషర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
మొండిగౌరెల్లిలోని సర్వేనెంబర్‌ 19లో క్వారీలు, క్రషర్లు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న వ్యాపారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

యాచారం, జనవరి 3 : మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్‌ 19లో క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కంటైనర్‌తో పాటు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసేందుకు క్యారీలు, క్రషర్ల యజమానులు చకచకా పనులు సాగిస్తున్నారు. కాగా, ఎన్నికల ముందు గ్రామంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటు చేయనిచ్చేదిలేదని చెప్పిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు.. నేడు మాట మార్చారు. క్వారీలు, క్రషర్ల యజమానులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని నమ్మించే యత్నం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నాయకులు ఎన్నికల వేళ ఒక మాట.. ఎన్నికలు ముగిసిన తరువాత మరో మాట చెబుతూ జనాలను మోసం చేస్తున్నారని మొండిగౌరెల్లి, యాచారం, గున్‌గల్‌, గడ్డమల్లాయాగూడ గ్రామాల రైతులు ధ్వజమెత్తుతున్నారు. ఈ సర్వేనెంబర్‌లో క్వారీలు, క్రషర్లు పెడితే వ్యవసాయం చేయలేమని, వందలాది ఎకరాల అసైన్డ్‌, పట్టాభూములు బీళ్లుగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే మైనింగ్‌ జోన్‌ కింద పనులు చేసుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మైనింగ్‌జోన్‌ కింద పనులు చేసేముందు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. కాగా, మైనింగ్‌ అధికారులు తక్షణమే యాచారం మండలంలో పర్యటించి రైతుల అభిప్రాయం తీసుకొని మైనింగ్‌జోన్‌ రద్దు చేయించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:57 PM