Share News

వన మహోత్సవానికి సన్నద్ధం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:26 AM

రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది.

వన మహోత్సవానికి సన్నద్ధం
నర్సరీలో సిద్ధంగా పెరుగుతున్న మొక్కలు

ఈసారి 82.599లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గిన టార్గెట్‌

జిల్లాలోని 558 నర్సరీల్లో రెడీగా మొక్కలు

శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం.. ఈసారి వృథా తగ్గింపు

గుంతలు సిద్ధం చేస్తున్న అధికారులు

జూలై మొదటి వారంలో వన మహోత్సవం

వన మహోత్సవానికి జిల్లా సిద్ధమైంది. వర్షాకాలంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ నెల మొదటి వారంలో మొక్కలు నాటేలా ప్లాన్‌ చేసింది. నర్సరీల్లో మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే, ప్రతీ ఏడాది పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో చాలావరకు ఎండిపోతున్నాయి. దీనికి తోడు చాలా మొక్కలు వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని కొంతమేర తగ్గించారు. నాటిన వాటినన్నింటినీ సంరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూలై 4 : రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. గత ప్రభుత్వం తెలంగాణ హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని చేపట్టగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటనుంది. ఇందులో భాగంగానే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్ధేశించారు. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో 24శాతం నుంచి 33 శాతం వరకు గత ప్రభుత్వంలో పచ్చదనం లక్ష్యం పెరిగింది. జిల్లాలో 50,3100 హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంది. అందులో అటవీ భూములు 29,545.90 హెక్టార్లున్నాయి. ఇది కేవలం 5.87 మాత్రమే. పెద్ద ఎత్తున పట్టణీకరణ, పెరిగిన కాలుష్య స్థాయిల దృష్ట్యా జిల్లాలో మన మహోత్సవం కార్యక్రమానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అయితే ఏటా ఈ కార్యక్రమాన్ని చేపుడుతున్నా క్షేత్రస్థాయిలో మొక్కలు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పదోసారి మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 558 గ్రామ పంచాయతీలు, 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. మూడేళ్ల నుంచి మొక్కలు నాటే లక్ష్యం తగ్గుతూ వస్తుంది. 2021లో 102.745 లక్షల మొక్కలు నాటగా 2022లో 89.248 లక్షలు నాటారు. ఇలా ఏటేటా లక్ష్యం తగ్గుతూ వస్తుంది. కానీ.. ఈ సారి లక్ష్యం కాస్త పెరిగింది. 2024 సంవత్సరంలో 82.599 లక్షలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు.

వృధా తగ్గింపు...!

గత 9 దఫాలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కల వృఽథా 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కిందిస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా గ్రామాల వారీగా లక్ష్యాలను ఇచ్చి మొక్కలు పెంచేవారు. వాటిని గ్రామాలకు తరలించేందుకు భారీగా నిధులు ఖర్చయ్యేవి. నాటేందుకు సరైన స్థలాలు లేక మొక్కుబడిగా నాటేవారు. ఎందుకంటే ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలాల్లో మొదటి, రెండు, మూడో విడతల్లోనే మొక్కలు నాటారు. అదే స్థానంలో నాటాలంటే పాతవాటిని తీసేసి కొత్తవి నాటాల్సిన పరిస్థితి. దాంతో పాటు చాలా మొక్కలను ఇంటింటికీ ఇచ్చినట్లు రాసుకుని ఎక్కడ బడితే అక్కడ వదిలేసేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈసారి లక్ష్యాలను భారీగా తగ్గించారు. దీంతో ఎక్కడ అవసరమో అక్కడే కొద్ది స్థాయిలో మొక్కలు నాటేందుకు అవకాశముంది.

శాఖల వారీగా లక్ష్యం నిర్దేశం..

వర్సాలు కురుస్తున్న నేపథ్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. గత ఏడాది హరితహారం లక్ష్యం 78.665 లక్షలు నిర్ధేశించగా 82.790 లక్షలు నాటినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. లక్ష్యానికి మించి మొక్కలు నాటినట్లు చెబుతున్నారు.. కానీ.. క్షేత్ర స్థాయిలో అందుకు బిన్నగంగా కనిపిస్తోంది. ఈ సారి లక్ష్యం 82.599 లక్షలు మొక్కలు నాటాలని నిర్ధేశించారు. అందులో అత్యధికంగా డీఆర్‌డీఏ శాఖకు 33.075 లక్షలు, తర్వాత మూడు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో 25.159 లక్షలు, అటవీశాఖ పరిధిలో 8.820 లక్షలు నాటాలని నిర్ధేశించారు.

ఈసారి కొన్ని శాఖల్లోనే..

జిల్లాలో 40 శాఖలపైనే ఉండగా.. కేవలం 18 శాఖల్లోనే వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. మిగతా శాఖల్లో ఈసారి ఎందుకు నాటడం లేదో తెలియడం లేదు. దీనిపై అధికారులు కూడా వివరణ ఇవ్వడం లేదని ప్రచారం సాగుతోంది. ప్రతీసారి హరితహారంలో లక్ష్యం భారీగా నిర్ణయిస్తున్నారు. కానీ.. నాటడంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. మొక్కలు నాటుతున్నా వాటిని సంరక్షించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నాటేందుకు మొక్కలు సిద్ధం

జిల్లాలో పదో విడతలో నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు ఇచ్చి వాటిని నాటేందుకు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అడిగిన మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇళ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు. మునగ, కానుగ, తులసి, ఈతతో పాటు ఔషధ, పూల మొక్కలను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపుల, పొలం, చెరువుగట్టు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలల ఆవరణలో నాటేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు అటవీ ప్రాంతాల్లో మరింత ఆహ్లాదాన్ని పెంచే విధంగా పలు పూల, పండ్ల మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో మొదటి, చివరి విడత హరితహారంలో పాల్గొన్న కేసీఆర్‌

హరితహారం మొదటి విడతలో అప్పటి సీఎం కేసీఆర్‌ చిలుకూరులో పాల్గొన్నారు. 2023లో జరిగిన కార్యక్రమంలో తుమ్ములూరులో పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ హరితహారం పేరిట 2015లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంంలో అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు 9 పర్యాయాలు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమాన్ని 2023 జూన్‌ 19న మహేశ్వరం మండలం తుమ్ములూరులోని అర్బన్‌ ఫారె్‌స్టలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా కేసీఆర్‌ మొక్కను నాటి ప్రారంభించారు.

జూలై మొదటి వారంలో మనమహోత్సవం : డీఆర్‌డీఏ పీడీ శ్రీలత

ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. భూమి నానుతుంది. జూలై మొదటి వారంలో వనమహోత్సవం పేరట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. డీఆర్‌డీఏ, అటవీ శాఖ పరిధిలో నిర్వహించే వన మహోత్సవానికి ఇప్పటికే శాఖల వారీగా మొక్కల టార్గెట్‌ నిర్ధేశించాం. ప్రతీ పంచాయతీ పరిధిలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.

వికారాబాద్‌ జిల్లాలో 27లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

పరిగి: జిల్లాలో ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నహాలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనమిది విడతలుగా ఏటా వానాకాలం ప్రారంభంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు హరితహారం పేరును వన మహోత్సవంగా మార్చి తొమ్మిదో విడతలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూలై మొదటి వారంలో జిల్లాలో వన మహోత్సవం కింద మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, వర్షాలు సరిగ్గా కురియక మొక్కలు నాటడం ఆలస్యమైంది. ప్రతీ పంచాయతీలో నిర్వహిస్తున్న నర్సరీల్లో నాటేందుకు మొక్కలు సిద్ధం చేశారు. ఈ సారి జిల్లాలో 27లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అధికారులు నాటించేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నాటకుండా నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కలను కూడా ఈసారి నాటించాలని అనుకుంటున్నారు. మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. గుర్తించిన ప్రదేశాల్లో జూన్‌ నుంచే మొక్కలు నాటించేందుకు అటవీ, ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 20 మండలాలు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, తాండూరు మున్సిపాల్టీలు అలాగే 566 పంచాయతీలు ఉన్నాయి. 3,386 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమం కింద 27లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన ప్రదేశాలను ఎంపిక చేస్తున్నారు. మండలానికి ఒక అధికారికి చొప్పున బాధ్యతలు అప్పగించనున్నారు. గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాలను, అటవీ శాఖ, ఆలయాలు, పరంపోగు భూముల్లో, గ్రామీణ, ఇతర ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించారు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు.

మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు

అటవీ, డీఆర్‌డీఏల ఆధ్వర్యంలో 27లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఐదు లక్షలు అటవీ శాఖ, 22లక్షలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరిగి, వికారాబాద్‌, తాండూరు, ధారూర్‌, కొడంగల్‌లలో అటవీ రేంజ్‌లు ఉన్నాయి. ఇందుకు రేంజ్‌ల వారీగా మొక్కలను నాటించి పెంచాలని నిర్ణయించాయి. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నర్సరీలను పెట్టి మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలను నాటించేందుకు జిల్లాలోని ఐదు రేంజ్‌ల రేంజర్లు, సెక్షన్‌/బీట్‌ అధికారులు కలిసి స్థలాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నర్సరీల నుంచి గ్రామాలకు చేరవేసేందుకు మొక్కలను సిద్ధంగా ఉంచారు. అలాగే డీఆర్‌డీఏ శాఖ అధకారుల ఆధ్వర్యంలో డీఆర్‌డీవో, ఏపీడీల అధ్వర్యంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను రంగంలోకి దింపారు. గ్రామల్లో అనువైన స్థలాల్లో మొక్కలు నాటించే పనుల్లో ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు.

మొక్కలను సిద్ధం చేస్తున్నాం : శ్రీనివాస్‌, పీడీ-డీఆర్డీఏ, వికారాబాద్‌ జిల్లా

జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా 20 మండలాల పరిధిలో గల 566పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ వన నర్సరీల్లో మొక్కలు పెరిగి సిద్ధంగా ఉన్నాయి. వానలు కురవడమే తరువాయి. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతాం. డీఆర్‌డీఏ శాఖ 22లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంది. 15లక్షల మొక్కలను రోడ్లు, ఖాళీ స్థలాల్లో నాటిస్తాం. ఏడు లక్షల మొక్కలను ఇళ్ల వద్ద నాటేందుకు ప్రజలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

అటవీ శాఖకు 5 లక్షల మొక్కలు టార్గెట్‌ : జ్ఞానేశ్వర్‌, డీఎ్‌ఫవో, విరాబాద్‌ జిల్లా

ఈ సారి అటవీ శాఖ ఆధ్వర్యంలో 5లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో ఐదు రేంజ్‌లు ఉన్నాయి. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను రెడీ చేశాం. గతేడాది మిగిలిపోయిన మొక్కలను కూడా నాటించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు పడగానే వన మహోత్సవానికి శ్రీకారం చుడతాం.

Updated Date - Jul 05 , 2024 | 12:51 AM