అనుమానాస్పద స్థితిలో రైలుకింద పడి పోస్టుమాస్టర్ మృతి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:48 PM
రైలుకింద పడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు రూరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైలుకింద పడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జినుగుర్తికి చెందిన జనుముల అంజిలయ్య(52) జినుగుర్తి బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన పోస్టల్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బులు శుక్రవారం రూ.14లక్షలను డ్రాచేసుకుని తన కుమారుడికి ఇచ్చి ఇంటికి పంపించాడు. అయితే రాత్రి 8గంటల సమయంలో తాండూరులోని శివాజీచౌక్ నుంచి నారాయణపూర్ రోడ్డు మార్గంలోని రైలు పట్టాలవద్ద తాండూరు-మంతట్టి రైలు వర్గంలోని పీర్‌పకీర్‌సాబ్ దర్గా సమీపంలో అంజిలయ్య రైలు కిందపడి మృతిచెందాడు. దీంతో శనివారం ఉదయం రైల్వే శాఖకు చెందిన కీమెన్ పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి తాండూరు రైల్వే సూపరింటెంటెండ్‌కు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్‌మాస్టర్ ఫిర్యాదుమేరకు తాండూరు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వీరేశం ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో భార్య సుశీల ఆధార్‌కార్డు, పోస్టల్‌కు సంబంధించిన కొన్ని రిసిప్టులు లభించాయి. రైలుపట్టాల పక్కనే మృతుడి బైకు కూడా నిలిపిఉంది. అయితే వాటిని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి శవపరీక్ష నిమిత్తం పంపించారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. భార్య సుశీల మాత్రం తన భర్తను ఎవరో హత్య చేసి రైలు పట్టాలపై పడేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాండూరు పోస్టల్ శాఖ ఇన్‌స్పెక్టర్ రాకే్‌షరెడ్డి మృతుని కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. పింఛన్‌కు సంబంధించిన రూ.14లక్షల డబ్బులపై ఆరా తీసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.. అదేవిధంగా సికింద్రాబాద్ జిల్లా పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రాకే్‌షరెడ్డి ఆధ్వర్యంలో రూ.10వేలు అందజేశారు.