తెలంగాణలో టీడీపీకి ప్రజాదరణ
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:09 AM
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ప్రజాదరణ పెరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు.

సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు
షాద్‌నగర్ అర్బన్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ప్రజాదరణ పెరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అక్టోబరు 26న ప్రారంభమైన సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా లక్షా 21 వేల మంది తీసుకున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనను చూసిన ప్రజలు తిరిగి టీడీపీ వైపు వస్తున్నారని, సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసి అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రిగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండడం, తెలంగాణలో సైతం పార్టీ సభ్యత్వంపై దృష్టి పెట్టడంతో ప్రజలు ముందుకు వచ్చి, సభ్యులుగా చేరుతున్నారని చెప్పారు. ప్రజా స్పందన చూస్తుంటే తెలంగాణలో సైతం టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని, వ్యవసాయ భూములను నాశనం చేసిందని విమర్శించారు. పేదలు పంటలు పండించి, బతకడానికి ఇచ్చిన భూములను సైతం లాక్కొని పరిశ్రమలకు ధారదత్తం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పేదల భూముల జోలికి వెళ్లకుండా పంట పొలాలు, పర్యావరణాన్ని పరిరక్షించాలని బక్కని డిమాండ్ చేశారు.