Share News

కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:14 AM

ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగి పోయారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు
కందుకూరు : నేదునూరులో మాట్లాడుతున్న కొండా

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కందుకూరు, ఏప్రిల్‌ 13 : ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగి పోయారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర శనివారం ఉదయం మండలంలోని చిప్పలపల్లి, ధన్నారం, పులిమామిడి, బాచుపల్లి, నేదునూరు, దాసర్లపల్లి, ముచ్చర్ల, ఊట్లపల్లి, సార్లరావులపల్లి, మీర్కాన్‌పేట, ఆకులమైలారం గ్రామామీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గుమ్మవెళ్లిలో బహిరంగ సభ నిర్వహించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి భూర నర్సయ్యగౌడ్‌తో కలిసి మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అప్పుల రాష్ట్రంగా మార్చాయన్నారు. కేంద్రం అమలు చేసిన ఫసల్‌భీమా, ఆవాజ్‌ యోజన వంటి పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, 24 రోజులపాటు కొనసాగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా 13 కిలోమీటర్ల మేర తిరిగి.. 380 గ్రామాలను పర్యటించి రైతులు, ప్రజలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించినట్లు కొండా తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రూ.9వేల కోట్ల నిధులను మంజూరు చేసినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తన విజయానికి శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌ గౌడ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, యాత్ర ఇన్‌చార్జి ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములయాదవ్‌, పాపయ్యగౌడ్‌, మిద్దె సుదర్శన్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, పార్టీ మండలాధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, మహేందర్‌, ఎంపీటీసీ మల్లేష్‌, మాజీ సర్పంచ్‌లు మల్లారెడ్డి, గౌర ప్రభాకర్‌, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొండా గెలుపునకు కృషి

రాజేంద్రనగర్‌ : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయానికి కార్యకర్తలు సైనికుల వలే పనిచేస్తున్నామని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి నవారు మురళీధర్‌రెడ్డి అన్నారు. నాయకులు రామిడి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరంలో విశ్వేశ్వర్‌రెడ్డికి పార్టీ ఎల్‌ఈడీ గుర్తును బహూకరించారు. మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబం ముద్ర బలంగా ఉందన్నారు. నిజాయితీగల నాయకునిగా కొండాకు పేరుందన్నారు. చేవెళ్ల నుంచి విశ్వేశ్వర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కానుకగా ఇవ్వాలన్నారు. మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బీజేపీ అద్యక్షుడు అడికె జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

సేవచేసే నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదర్‌నగర్‌ : ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్‌యాదవ్‌ అన్నారు. హైదర్‌నగర్‌ భాగ్యనగర్‌, హెచ్‌ఎంటీ శాతవాహన, హెచ్‌ఎంటీహిల్స్‌, నాగార్జునహోమ్స్‌, నిజాంపేటరోడ్‌, అల్లాపూర్‌ సొసైటీ కాలనీల్లో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated Date - Apr 14 , 2024 | 12:14 AM