Share News

ట్రాఫిక్‌జామ్‌తో ప్రయాణికుల ఇక్కట్లు

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:16 PM

ట్రాఫిక్‌ పోలీసుల వైఫల్యంతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. నగర శివారు అప్పా జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ చౌరస్తా వరకు హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

ట్రాఫిక్‌జామ్‌తో ప్రయాణికుల ఇక్కట్లు
అజీజ్‌నగర్‌ వద్ద హైదరాబాద్‌-జాతీయ రహదారి పక్కన టిఫిన్‌ సెంటర్ల వద్ద నిలిపిన వాహనాలు

రోడ్డుపక్కనే టిఫిన్‌ సెంటర్ల ఏర్పాటు

పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో ఇబ్బందులు

ట్రాఫిక్‌ పోలీసుల వైఫల్యమే కారణం!

మొయినాబాద్‌ రూరల్‌, మార్చి 9 : ట్రాఫిక్‌ పోలీసుల వైఫల్యంతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. నగర శివారు అప్పా జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ చౌరస్తా వరకు హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. పలు చోట్ల చౌరస్తాల వద్ద టిఫిన్‌ సెంటర్లు రోడ్డుపక్కనే ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లేవారు తమ వాహనాలను రోడ్డుకు ఆనుకొని నిలుపుతున్నారు. దాంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే ప్రయాణికులతో రోజూ వాహనాల రద్దీ ఉంటుంది. శని, ఆదివారాల్లో వాహనాల రాకపోకలు మరీ ఎక్కువ. అప్పా జంక్షన్‌ నుంచి హిమాయత్‌ నగర్‌ చౌరస్తా వరకు మూడు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరానికే కనీసం గంటన్నర సమయం పడుతుందని.. దాంతో గంటల తరబడి రోడ్డుపైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇంటర్‌ పరీక్షలు మొదలవ్వడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగిపోయింది. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన టిఫిన్‌ సెంటర్లను తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాజేంద్రనగర్‌, హిమాయత్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసుల వైఫల్యంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. రోడ్డుపక్కనే టిఫిన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:16 PM