ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:52 PM
కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి కోరారు.

పరిగి, జవనరి 12: కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి కోరారు. పరిగి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత మండలాల్లో కూడా బూత్‌స్థాయి సహాయకులను కొత్తగా నియామకాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీపీ అరవింద్‌రావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోలతో తహసీల్దార్ వెంకటేశం సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటరు నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రవి, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.