‘వుడా’తో ఊతం!
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:48 PM
జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల పరిధిలోని గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ‘వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వుడా)’ను ఏర్పాటు చేసింది. ‘వుడా’ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పాలక వర్గాల పాలనకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందుకు సాగనుంది.
‘వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ ఏర్పాటుకు సన్నాహాలు
-జిల్లా యూనిట్‌గా అభివృద్ధి ప్రణాళిక
-4 మున్సిపాలిటీలు.. 585 పంచాయతీలు
-మౌలిక వసతులు, అభివృద్ధే లక్ష్యం
జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల పరిధిలోని గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ‘వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వుడా)’ను ఏర్పాటు చేసింది. ‘వుడా’ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పాలక వర్గాల పాలనకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందుకు సాగనుంది. పూర్తి పాలనా పగ్గాలు పాలకవర్గాలకే ఉండనున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకల్పన, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యత ‘వుడా’ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించే దిశగా ఈ అథారిటీ పని చేయనుంది.
వికారాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జిల్లా కేంద్రం చుట్టూ ఉండే కొన్ని గ్రామాలను కలుపుకొని పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. కేవలం జిల్లా కేంద్రం, దాని చుట్టూ ఉండే కొన్ని గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందడానికి వీలు ఉండేది. అయితే జిల్లా కేంద్రం వరకే కాకుండా జిల్లా మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని కొత్తగా అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మునిసిపాలిటీలు, గ్రామాలను కలిపి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధం చేశారు.
అథారిటీ పర్యవేక్షణలో అభివృద్ధి పనులు
జిల్లాలో 4 మునిసిపాలిటీలతో పాటు 585 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మునిసిపాలిటీలు, 585 గ్రామ పంచాయతీలు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ స్వయం ప్రతిపత్తి ఉండనుంది. వికారాబాద్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (వుడా) ఏర్పాటైతే కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు విడుదల కానున్నాయి. పట్టణాల అభివృద్ధికి పట్టణాభివృద్ధి శాఖ నిధులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ నిధులను వినియోగించనున్నారు. మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ పర్యవేక్షణలో కొనసాగనుంది. అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ పట్టణాలతో పాటు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించనుంది. మౌలిక వసతులకు పెద్ద పీట వేయనున్నారు. మునిసిపాలిటీలు, గ్రామాల పాలకవర్గాలకు అనుసంధానంగా ఈ అథారిటీ పనిచేయనుంది. లే అవుట్ల అభివృద్ధితో పాటు గ్రామాలు, పట్టణాల్లో రహదారులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, కల్వర్టులు, డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణానికి నేరుగా నిధులు వెచ్చించే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణాలు, లేఔట్లు, పరిశ్రమల ఏర్పాటుకు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీయే అనుమతులు జారీ చేయనుంది.
పాలకవర్గాలకు అనుసంధానంగా..
అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే మునిసిపాలిటీలు, పంచాయతీల్లో పాలక వర్గాల పాలన ఎలాంటి విఘాతం లేకుండానే కొనసాగనుంది. పాలనా పగ్గాలు పాలకవర్గాలకు ఉండనున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకల్పన, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణ బాధ్యత అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించే దిశగా ఈ అథారిటీ పని చేయనుంది. అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీకి వైస్ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరించనుండగా, చైర్మన్‌ను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. కాగా, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
సీఎం చొరవతోనే ఏర్పాటు: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి, అక్టోబరు 20(ఆంఽధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(వుడా) ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హెఎండీఏ తరహాలో వుడా ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటిలతో పాటు, అన్ని గ్రామాలకు కూడా ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయనానరు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ‘వుడా’ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పరిగి దామగుండంలో నేవీరాడార్ స్టేషన్ ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతుందని తెలిపారు. జిల్లాలో త్రిబుల్‌ఆర్, రైల్వేలైను, పాలమూరు ఎత్తిపోతలను కూడా సాధించి తీరుతామని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పార్థసారథి, మాజీ జడ్పీటీసీ పి.చంద్రయ్య, డీసీసీ కార్యదర్శి కె.హణ్మంత్‌ముదిరాజ్. మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.