Share News

ఇక రెండే జిల్లాలా?

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:52 PM

ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిపై కమిషన్‌ వేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై మరోసారి చర్చమొదలైంది. గతంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను మూడు భాగాలుగా విభజించి రంగారెడ్డిజిల్లాతో పాటు కొత్తగా వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇక రెండే జిల్లాలా?

జిల్లాల విభజనపై కమిషన్‌ ఏర్పాటుకు సర్కారు కసరత్తు

పార్లమెంట్‌ పరిధిలో ఒక జిల్లా ప్రతిపాదన!

శాస్త్రీయంగా డివిజన్లు, మండలాలు

ఇప్పటికే రంగారెడ్డి కలెక్టరేట్‌పై తీవ్ర వ్యతిరేకత

రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు, ప్రజల అవస్థలు

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై మరోసారి చర్చమొదలైంది. అస్తవ్యస్తంగా ఉన్న కొత్త జిల్లాలపై కమిషన్‌ వేయాలని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కాలయాపన చేయకుండా కమిషన్‌ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని ఆరునెలల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటుంది. దీన్ని బట్టి చూస్తే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం మెండుగా కన్పిస్తున్నాయి. శాస్త్రీయ విధానాలతో జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిపై కమిషన్‌ వేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై మరోసారి చర్చమొదలైంది. గతంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను మూడు భాగాలుగా విభజించి రంగారెడ్డిజిల్లాతో పాటు కొత్తగా వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా అస్తవ్యస్తంగా ఉన్న కొత్త జిల్లాలపై కమిషన్‌ వేయాలని ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఏండీ వేమూరి రాఽధాకృష్ణ నిర్వహించిన బిగ్‌డిబేట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌లో రెవెన్యూ రిటైర్డ్‌ అధికారులు కూడా ఉంటారని తెలిపారు. కాలయాపన చేయకుండా కమిషన్‌ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని ఆరునెలల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ, పోలీసు, ఇతర వ్యవస్థలన్నీ ఒకే చట్రంలో పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉదాహరణకు ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఒకే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. అలాగే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఒక డీఎస్పీ , ఇతర వ్యవస్థలు ఉండే విధంగా శాస్త్రీయ పద్దతిలో పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్నారు. దీన్ని బట్టి జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.

ఒక జిల్లాకు రెండు ప్రాంతాల పేర్లు

ఏదైనా జిల్లాకు ఓ ప్రముఖ ప్రాంతం పేరు పెట్టడం అనవాయితీ. కానీ రెండు ప్రాంతాల పేరుతో మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ రెండు కూడా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు కావడం గమనార్హం. ఇలా ఎందుకు రెండు ప్రాంతాల పేర్లు పెట్టారో కూడా ఎవరికీ అర్ధం కాదు. విచిత్రమేమిటంటే జిల్లా పేరు ఉన్న మేడ్చల్‌లో కానీ మల్కాజిగిరిలో కానీ కలెక్టరేట్‌ నిర్మాణం చేయలేదు. శామీర్‌పేట సమీపంలో కలెక్టరేట్‌ నిర్మించారు. మరో విచిత్రమేమిటంటే మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా పరిషత్‌లో సభ్యులు సంఖ్య కేవలం ఐదు మాత్రమే. జడ్పీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పోనూ ఇద్దరు సభ్యులే ఉంటారు. ఇద్దరు జడ్పీటీసీల మద్దతు ఉంటే చాలు జడ్పీ చైర్మన్‌ అయిపోవచ్చు. ఇలాంటి పరిస్థితి దేశంలోనే ఎక్కడా ఉండకపోవొచ్చు. ఇందువల్లే శాస్త్రీయ విధానాలతో జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పార్లమెంట్‌ పరిధిలో జిల్లా!

కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంట్‌ పరిధిలో ఒక జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాలపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాల విభజనతో పాటు జిల్లా కేంద్రాల విషయంలో కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఒక సమయంలో హైదరాబాద్‌ పక్కనే ఉన్న చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని వికారాబాద్‌ జిల్లాలో కలిపారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరకు మళ్లీ రంగారెడ్డిజిల్లాలోనే ఉంచారు. తాజాగా ప్రభుత్వం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించడంతో కొత్త జిల్లాలను ఎలా మదింపు చేస్తారనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక పార్లమెంట్‌ పరిధిలో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో రెండు జిల్లాలు ఉండే అవకాశం ఉంది. ఇటీవల పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరిగి మండల పరిషత్‌ సర్వసభ్యసమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధిలో ఒక జిల్లా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

మెజార్టీ అభిప్రాయాన్ని కాదని కలెక్టరేట్లు

ముఖ్యంగా రంగారెడ్డిజిల్లా విభజన తరువాత కొత్తగా ఏర్పాటైన జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాల విషయంలో అప్పటి ప్రభుత్వం ఇష్టారాజ్యంగానే వ్యవహరించింది. అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అప్పట్లో రంగారెడ్డి కలెక్టరేట్‌ ఏర్పాటుకు పలు చోట్ల స్థల పరిశీలన జరిపారు. ఇందులో రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్శిటీతో పాటు అప్పా జంక్షన్‌ వద్ద కొత్త కలెక్టరేట్‌ ఏర్పాటు చేయాలని మెజార్టీ ఎమ్మెల్యేలు., ప్రజా ప్రతినిధులు కోరారు. కానీ దీనికి విరుద్ధంగా రావిర్యాలలో కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టారు. దీనిపై అప్పట్లో ఎమ్మెల్యేలు ఈ విషయంపై కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. చకచక నిర్ణయాలు తీసేసుకున్నారు.

రవాణా సౌకర్యం అంతంతే..

అయితే ఇప్పటికీ రావిర్యాలలో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఉద్యోగుల కోసం ఉదయం., సాయంత్రం మాత్రం రెండేసి బస్సులు నడుపుతున్నారు. సాధారణ వ్యక్తులు అక్కడికి చేరుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సిందే. కనీసం రూ.వేయి ఖర్చు కావాల్సిందే. ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లక్డీకాపూల్‌లో ఉండే ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌ ఇంతకంటే అందరికీ సౌకర్యంగా ఉండేది. ముందు బస్టాప్‌, వెనుక రైల్వే స్టేషన్‌ ఉండడంతో సుదూరం నుంచి కూడా ఎలాంటి ప్రయాస లేకుండా ఇక్కడకు చేరుకునేవారు. ఇప్పుడు అక్కడకు సామాన్యులు వెళ్లాంటే క్యాబ్‌లు, ఆటోలే దిక్కు. ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీరికి 28శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండేది. ఇప్పుడు కేవలం 11శాతమే హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. దీంతో జీతం రూ.10 నుంచి 15వేల వరకు తగ్గిపోవడంతో ఉద్యోగులంతా లబోదిబోమంటున్నారు. రావిర్యాలలో ఉండే అవకాశం లేకపోవడంతో నగరం నుంచి అందరూ రాకపోకలు సాగిస్తున్నారు. రవాణా ఖర్చులు తడిసిమోపెడువుతున్నాయి. ఇక మేడ్చల్‌- మల్కాజిగిరి కలెక్టరేట్‌ కొంత ఫర్వాలేదు. కానీ ఇక్కడకు కూడా వెళ్లేందుకు కూడా నేరుగా బస్సు సర్వీసులు లేవు.

Updated Date - Jan 12 , 2024 | 12:18 AM