Share News

లక్ష్యం కోసం కృషి చేస్తేనే ఫలితాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:32 PM

విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందని, ఎవరైనా లక్ష్యం కోసం కృషిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు.

లక్ష్యం కోసం కృషి చేస్తేనే ఫలితాలు
జిల్లా స్థాయి సైన్స్‌, మ్యాథమాటిక్స్‌, పర్యావరణ ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

పట్నంలో జిల్లా స్థాయి సైన్స్‌, మ్యాథమాటిక్స్‌, పర్యావరణ ప్రదర్శన

ఇబ్రహీంపట్నం, జనవరి 9 : విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందని, ఎవరైనా లక్ష్యం కోసం కృషిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. విద్యార్థులు మేథస్సుకు పదునుపెట్టి లక్ష్య సాధనకు పాటుపడితేనే ఫలితాలు బాగుంటాయని ఆమె అన్నారు. విద్యా వ్యవస్థ బాగుకోసం ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్‌ హైస్కూల్‌లో రెండ్రోజులపాటు జరగనున్న 51వ జిల్లా స్థాయి సైన్స్‌, మ్యాథమాటిక్స్‌, పర్యావరణ ప్రదర్శన(బాల్‌ వైజ్ఞానిక్‌ ప్రదర్శన) మంగళవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ప్రదర్శనలో గురుకుల విద్యాపీఠ్‌, ఇబ్రహీంపట్నం పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన స్వాగత నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో అతిథులు గౌరవవందనం స్వీకరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. సమయం చాలా విలువైందని సెల్‌ఫోన్‌, ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలన్నారు. అవసరం మేరకే వాటిని వాడాలని ఆమె సూచించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత ఒక్క రోజులో వచ్చింది కాదని, వేల సంవత్సరాల నిరంతర ఆలోచన, తపన, కృషితో అది సాధ్యమైందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సవతుల కల్పనకు ప్రభుత్వం కృషిచేయాలని, విద్యా రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలన్నారు. ఇబ్రహీంపట్నం ఎమెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. సమాజ వికాసానికి విద్యే మూలం అని, విద్యారంగం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. సైన్స్‌ అంటేనే తెలుసుకోవడం అని, ఒక్క చిన్న ప్రశ్న నుంచే మేధోమథనంతో నూతన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయన్నారు. బాల్య దశ నుంచే విశ్లేషనాత్మక ఆలోచనను అలవాటు చేసుకోవాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. డీఈవో సుశీందర్‌రావు స్వాగతోపన్యాసం చేస్తూ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 312 గణిత, వైజ్ఞానిక, పర్యావరణ ప్రాజెక్టులు ప్రదర్శిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, జెడ్పీటీసీ మహిపాల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతి, విద్యాపీఠ్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ డి.శ్రీనివా్‌సరావు, జిల్లా సైన్స్‌ అధికారి వై.శ్రీనివా్‌సరావు, డీసీఈబీ సెక్రటరీ రామచంద్రారెడ్డి, ఎంఈవోలు కె.వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:32 PM