Share News

వృద్ధ మహిళ.. నిలువు దోపిడీ

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:24 PM

ఓ వృద్ధ మహిళ వద్ద రెండు తులాల బంగారం, రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన ఆటోడ్రైవర్‌ నిర్వాకం మండల పరిధిలో వెలుగుచూసింది.

వృద్ధ మహిళ.. నిలువు దోపిడీ

ఆటో ఎక్కిన ప్రయాణికురాలి వద్ద ఆటోడ్రైవర్‌ నిర్వాకం

2 తులాల పుస్తెలతాడు, రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్న వైనం

ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

మంచాల, జనవరి 9: ఓ వృద్ధ మహిళ వద్ద రెండు తులాల బంగారం, రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన ఆటోడ్రైవర్‌ నిర్వాకం మండల పరిధిలో వెలుగుచూసింది. కాగా, నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా లింగంపేట మండలం సంగారెడ్డిపేటకు చెందిన కొవ్వూరు లక్ష్మి కొంతకాలంగా మీర్‌పేట్‌లో ఉంటున్న తన చిన్న కూతురు వద్ద ఉంటోంది. కాగా, పింఛన్‌ డబ్బుల కోసమని నాలుగు రోజుల క్రితం సొంతూరు సంగారెడ్డిపేటకు వెళ్లింది. డబ్బులు తీసుకున్న ఆమె ఈనెల 7న సంగారెడ్డిలో బస్సు ఎక్కి అదేరోజు సాయంత్రం 4.30 ప్రాంతంలో ఎంజీబీఎ్‌సలో దిగింది. ఓ ఆటోడ్రైవర్‌ ఆమెను మీర్‌పేట్‌లో దించడానికి రూ.200లకు బేరం కుదుర్చుకున్నాడు. ఆమెను మూడు గంటలపాటు ఆటోలో అటూఇటూ తిప్పి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌ లాక్కొని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆమె ఎలాగోలా ఆర్టీసీ బస్సెక్కి మంచాల మండలం రంగాపూర్‌లో దిగింది. స్థానికుల సాయంతో మంచాల పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆ వృద్ధురాలి నుంచి వివరాలు తీసుకుని మీర్‌పేట్‌లోని కూతురికి అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దోపిడీకి పాల్పడిన ఆటోడ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు సీఐ కాశీవిశ్వనాథ్‌ తెలిపారు.

Updated Date - Jan 09 , 2024 | 11:24 PM