Share News

ఆయిల్‌పామ్‌ సాగుచేయాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:27 PM

రైతులు ఆధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని షాద్‌నగర్‌ ఉద్యానవన శాఖాధికారి ఉషారాణి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పామ్‌ సాగు, ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.

ఆయిల్‌పామ్‌ సాగుచేయాలి

షాద్‌నగర్‌ ఉద్యానవన శాఖాధికారి ఉషారాణి

కొందుర్గు, జనవరి 9: రైతులు ఆధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని షాద్‌నగర్‌ ఉద్యానవన శాఖాధికారి ఉషారాణి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పామ్‌ సాగు, ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ పంట అనేది నూనెల పంట అని, దీనికి మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని, ప్రతీ సంవత్సరం లక్ష కోట్ల ఖర్చుతో విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, ఆ పరిస్థితి రాకుండా నూనె పంటలను పండించాలని కోరారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన తరువాత 4 ఏళ్ల నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరం దిగుబడి వస్తుందన్నారు. ఆదాయం కూడా నిరంతరంగా వస్తుందని తెలిపారు. మొదటి సంవత్సరం ఆదాయం కోసం సోయాబీన్‌, వేరుశనగ, పసుపు, నువ్వులు, ఆవాలు, జామ, అరటి, మినుము, కూరగాయల పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ పంటకు తెగుళ్ళు, చీడపీడలు వంటివి ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువని, తుపాన్‌, వడగండ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, షాద్‌నగర్‌ డివిజన్‌లో 1,500 ఎకరాల్లో సాగు చేయడం లక్ష్యం కాగా, కొందుర్గు మండలంలో 228 ఎకరాల్లో సాగు చేయడం కోసం 44 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకోవడం జరిగిందని, వీరిలో ఏడుగురు రైతులకు సంబంధించి 31.5ఎకరాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక ఎకరానికి త్రిభూజాకారంలో 57 మొక్కలను నాటాలని, దీనికి గానూ ఒక్క మొక్కకు ధర రూ.193 కాగా, రాయితీపై 20 రూపాయల చొప్పున 8,650 రూపాయల రాయితీ లభిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ 5 ఎకరాల్లోపు ఓసీ, బీసీ రైతులకు 90 శాతం, 5 ఎకరాలపైన ఓసీ రైతులకు 80 శాతం రాయితీతో డ్రిప్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:27 PM