సమసమాజ స్థాపనకే ‘న్యాయ్ యాత్ర’
ABN , Publish Date - Feb 11 , 2024 | 12:01 AM
దేశంలో సమసమాజ స్థాపన కోసమే రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కొందుర్గు, ఫిబ్రవరి, 10: దేశంలో సమసమాజ స్థాపన కోసమే రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం మండల కేంద్రం శివారు గ్రామమైన లూర్థునగర్‌లో ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మొదటి విడతలో భాగంగా భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారని, రెండో విడతలో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు న్యాయ్ యాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽధిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పది రోజులుగా మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఎంపీ ఏనాడు సమస్యలను పట్టించుకోలేదని, గ్రామాలు, మండలాలల్లో ఎంపీ పర్యటించలేదని, దాంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం వంశీచంద్‌రెడ్డి అన్ని గ్రామాల్లో తన యాత్ర కొనసాగిస్తున్నారని, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. షాద్‌నగర్ నియోజవర్గంలో నేటి నుంచి కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్‌లో ఉదయం 8గంటలకు సంఘీభావ యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి ఎస్‌బీపల్లి, కొడిచర్ల, పెంజర్ల మీదుగా మండల కేంద్రం కొత్తూరుకు చేరుకొన్నాక కార్నర్ మీటింట్ ఉంటుందని చెప్పారు. అనంతరం నందిగామ మండల పరిఽధిలోని చేగూరు, వెంకమ్మగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ, సాయంత్రం 7 గంటలకు నందిగామలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. 12న సోమవారం కొందుర్గు మండల పరిధిలోని పాత ఆగిర్యాల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుందని, అక్కడి నుంచి కొత్త ఆగిర్యాల, వెంకిర్యాల, తంగెళ్లపల్లి, మధ్యాహ్నం మండల కేంద్రం కొందుర్గులో కార్నర్ మీటింగ్ ఉంటుందన్నారు. అనంతరం జిల్లేడ్-చౌదరిగూడ మండల పరిధిలోని ఎదిర, రావిర్యాల, గుర్రంపల్లి, ఇంద్రానగర్ గ్రామలతో పాటు మండల కేంద్రం చౌదరిగూడలో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. 13న మంగళవారం కేశంపేట మండలం నిర్ధవెల్లి నుంచి యాత్ర ప్రారంభం కానుందని, అక్కడి నుంచి లేమామిడి, కాకునూర్, సుందరాపూర్ నుంచి మండల కేంద్రం కేశంపేట్‌లో కార్నర్ మీటింగ్ ఉంటుందని, అనంతరం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రామేశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుందని, అక్కడి నుంచి కిషన్‌నగర్, హాజిపల్లి మీదుగా షాద్‌నగర్ చేరుకొని చౌరస్థాలో కార్నర్ మీటింగ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కాగా, అంతకుముందు ఎమ్మెల్మే మండల కేంద్రంలో ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు దామోదర్‌రెడ్డి, కె.రాములుగౌడ్, బి.నరేందర్, బి.రవి, సి.కృష్ణయ్య, రామస్వామి, బి.నర్సింలు, జీబీ కృష్ణ, ప్రతా్‌పరెడ్డి, జార్జిరెడ్డి, మర్రెడ్డి, జితేందర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, వేణుగోపాల్‌లు పాల్గొన్నారు.