Share News

సబ్జెక్టులపై పట్టింపేది?

ABN , Publish Date - May 03 , 2024 | 12:17 AM

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలవడానికి కారణం..

సబ్జెక్టులపై పట్టింపేది?

మ్యాథ్స్‌, సైన్స్‌ పాఠ్యాంశాల్లో పట్టు సాధించని టెన్త్‌ విద్యార్థులు

తెలుగు, సోషల్‌ స్టడీ్‌సలోనూ అదేతీరు

ఇంగ్లి్‌షలో తడబాటు

పదో తరగతి పరీక్ష ఫలితాల విశ్లేషణలో వెల్లడి

వికారాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలవడానికి కారణం.. ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థులకు పట్టు లేకపోవడమే అనేది స్పష్టమవుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని తేలింది. తెలుగు సబ్జెక్టులోనూ విద్యార్థులు తడబడడం గమనార్హం. సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లోనూ చాలామందే ఫెయిలయ్యారు. ఇదిలా ఉంటే హిందీలోనే విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. టెన్త్‌లో గతేడాది వికారాబాద్‌ జిల్లా 59.46శాతం ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలువగా, ఈ సారి ఫలితాల్లో 65.1శాతం ఉత్తీర్ణతతో అదే 33వ స్థానంలో నిలిచింది. గతం కంటే పాస్‌ పర్సెంట్‌ 5.64 పెరగడం కొంత ఊరటనిస్తున్నా.. రాష్ట్రంలో చివరి స్థానంలో నిలవడం విచారకరం. మార్చిలో 13,357 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,695 మంది పాసయ్యారు.

మ్యాథ్స్‌, సైన్స్‌లలో పట్టుతప్పారు

విద్యార్థులు ఎక్కువగా మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారు. మేఽథమెటిక్స్‌లో 3,180, సైన్స్‌లో 2,252 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫస్ట్‌ లాంగ్వెజ్‌ తెలుగులో 1,315 మంది, 1,033 మంది ఫెయిల్‌ అయ్యారు. థర్డ్‌ లాంగ్వెజ్‌ ఇంగ్లి్‌షలో 735 మంది, సెకండ్‌ లాంగ్వెజ్‌ హిందీలో 72 మంది ఫెయిలయ్యారు. సబ్జెక్టుల వారీగా మ్యాస్‌లో 76.19శాతం, సైన్స్‌లో 83.13శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంగ్లి్‌షలో 94.49 శాతం, సోషల్‌లో 92.26శాతం, తెలుగులో 90.14 శాతం, హిందీలో 99.46 శాతం చొప్పున పాసయ్యారు.

రెగ్యులర్‌ హెచ్‌ఎంలు లేక పర్యవేక్షణ కరువు

పదో తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారనే దానిపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం లేదు. జిల్లాలో 92 ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎంలు లేరు. ఇన్‌ఛార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయులుంటే విద్యార్థుల చదువులపై, ఉపాధ్యాయుల బోధనపై పర్యవేక్షణ ఉండేది. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో విద్యార్థుల చదువులకు కొంత ఆటంకం కలిగింది. క్రమం తప్పకుండా చదివితేగానీ పట్టు సాధించలేని మ్యాథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులపై చాలా మంది విద్యార్థులు నిర్లక్ష్యం ఫెయిల్‌ అయ్యారు. తెలుగు, సోషల్‌, ఇంగ్లిష్‌ పరీక్షల్లో సమాధానాలు రాయడంలో తడబడ్డారు. గతంలో చాలాచోట్ల కాపీయింగ్‌ నడిచేది. కొన్నేళ్లుగా పకడ్బందీగా పరీక్షల నిర్వహణతో విద్యార్థులు ఫెయిలవుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధపెడితేనే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.

ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే సత్ఫలితం

పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసయ్యేలా విద్యా శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలైన మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, తెలుగు, సోషల్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో వారికి పట్టు పెంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీకి సన్నద్ధం చేసేలా విద్యా శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:17 AM