Share News

నామినేటెడ్‌ సందడి!

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:13 AM

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికలపై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టింది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులిస్తూ వారి సేవలకు గుర్తింపు ఇస్తోంది.

నామినేటెడ్‌ సందడి!

పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి

రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కాల్వ సుజాత

పట్టణ మౌళిక సదుపాయల ఆర్థిక సంస్థ చైర్మన్‌గా రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

మల్‌రెడ్డి రాంరెడ్డికి రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్‌గిరీ

కొడంగల్‌, మార్చి 17 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికలపై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టింది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులిస్తూ వారి సేవలకు గుర్తింపు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఈ క్రమంలో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపునకు విశేష కృషి చేసిన గురునాథ్‌రెడ్డికి పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం గురునాథ్‌రెడ్డి ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గురునాథ్‌రెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెల్చారు. సర్పంచ్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎంపీపీ, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 1992లో హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ సారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనకు పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి, ప్యాక్స్‌ చైర్మన్‌ కటకం శివకుమార్‌గుప్తా, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు దాసప్ప యాదవ్‌, మురారి వశిష్ట, రమేశ్‌, జయతీర్థచారి తదితరులు గురునాథ్‌రెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

కాల్వ సుజాతకు సముచిత స్థానం

తాండూరు: తాండూరు నియోజకవర్గానికి రెండోసారి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవి దక్కింది. తాండూరు పట్టణానికి చెందిన కాల్వ సుజాతను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంతకు ముందు తాండూరుకే చెందిన ఏఐసీసీ సభ్యుడు మల్కుడ్‌ రమే్‌ష రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడిగా నియామకమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లుగా పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి పలు కార్పొరేషన్లకు నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కె.సుజాత ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె టికెట్‌ ఆశించారు కానీ కొన్ని సమీకరణాల వల్ల పార్టీ ఆమెకు టికెట్‌ ఇవ్వలేకపోయింది. అయితే పార్టీ గెలుపు కోసం ఆమె జిల్లా వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీకి సుజాత అందజేస్తున్న సేవలను గుర్తించి అధిష్టానం అమెను ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది.

రంగారెడ్డి జిల్లా నేతలకూ పదవులు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని నేతలకు ప్రభుత్వం పదవుల్లో పెద్దపీట వస్తోంది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి పట్టణ మౌళిక సదుపాయల ఆర్థిక సంస్థ చైర్మన్‌ పదవి, మల్‌రెడ్డి రాంరెడ్డికి రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి దక్కాయి. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఎన్నికల సమయంలో క్రీయాశీలకంగా వ్యహరించారు. జిల్లెలగూడ ఉపసర్పంచ్‌గా, సర్పంచ్‌గా, సరూర్‌నగర్‌ జడ్పీటీసీగా, యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పీసీసీ సెక్రటరీగా తొమిదేళ్లు సేవలందించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేశారు. ప్రస్తుతం డీసీసీగా కొనసాగుతున్న ఆయనకు పట్టణ మౌళిక సదుపాయల ఆర్థిక సంస్థ చైర్మన్‌ దక్కింది. పార్టీ అధిష్టానానికి, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 12:13 AM