Share News

ప్రారంభానికి నోచని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:58 PM

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. మేడ్చల్‌ చెక్‌పోస్టు నుంచి మేడ్చల్‌కు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే 5 ఎకరాల్లో దాదాపు రూ.6 కోట్లతో రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని నిర్మించారు.

ప్రారంభానికి నోచని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం
మేడ్చల్‌లో నిర్మించిన మత్స్య శిక్షణా కేంద్రం

ఐదు ఎకరాల్లో రూ.6కోట్లతో నిర్మాణం

అందుబాటులోకి తేవాలని మత్స్యకారుల విన్నపం

మేడ్చల్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. మేడ్చల్‌ చెక్‌పోస్టు నుంచి మేడ్చల్‌కు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే 5 ఎకరాల్లో దాదాపు రూ.6 కోట్లతో రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకినాడలో మాత్రమే రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం ఉండేది. రాష్ట్రం విడిపోయిన తరువాత మేడ్చల్‌లో శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్‌లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కాగా, ఈ కేంద్రంలో ఆడిటోరియం, ల్యాబ్‌ కొరకు ప్రత్యేక భవనం, అడ్మిన్‌ భవనాలను నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ శిక్షణ తీసుకునే వారు ఉండేందుకు హాస్టల్‌ భవనాన్ని కూడా నిర్మించారు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. సంవత్సరానికి మూడు బ్యాచ్‌ల చొప్పున శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా ఆక్వా కల్చర్‌పై శిక్షణ ఇక్కడ అందిస్తారు. రాష్ట్రంలో నీటి వనరులు, అనువైన భూములు, అవసరమైన మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండటంతో మత్స్య సంపదను అభివృద్ధి పరిచి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. ముఖ్యంగా ఆక్వా కల్చర్‌ను సుస్థిర పరుచుటకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. శిక్షణ కేంద్రంలో దాదాపు రూ.50 లక్షలతో ఆక్వా ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు చేపల పెంపకంలో భాగంగా రైతులకు సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఆక్వా రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందేటట్లు చూడటం, ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ల ద్వారా నిరంతరంగా వ్యాధుల పర్యవేక్షణ, నివారణ తదితర అంశాలపై మత్స్య సంఘాల సభ్యులకు శిక్షణ అందిస్తారు. చేపల పెంపకంలో సులువైన పద్దతులు, పర్యావరణ సంరక్షణపై శాస్త్రీయ పరిశీలన చేపట్టడం, పర్యావరణ అనుకూల పెంపకం వంటి పద్దతులపై అవగాహన కల్పిస్తారు. ఆక్వా కల్చర్‌లో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక విషయాలు, సాంకేతికపరమైన అంశాలు, అవలంభించాల్సిన పద్దతులపై అవగాహన కల్పిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అలంకరణ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉండేది. ఇళ్లల్లో అక్వేరియంలో పెంచుకునే విధంగా అలంకరణ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో రంగురంగుల చేప పిల్లలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు. కొన్ని సంవత్సరాల తరువాత అలంకరణ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మరుగునపడిపోయింది. దాంతో ఆ కేంద్రాన్ని మూసివేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తయినప్పటికీ టీఎ్‌సఎ్‌ఫటీఐ ప్రారంభానికి నోచుకోవడం లేదు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వమైన టీఎ్‌సఎ్‌ఫటీఐని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:58 PM