Share News

ప్రకృతి ఒడి.. మంచాల విడిది

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:30 PM

నగర వాసులకు వారాంతపు, సెలవు రోజుల్లో కాలక్షేపం ఇష్టం. గతంలో సెలవులొస్తే వారు నగరంలోనే సినిమాలు, పార్క్‌లకు వెళ్లేవారు. కానీ నేడు ట్రెండ్‌ మారింది. జనం అభిరుచులను మార్చుకుంటున్నారు. సెలవులొస్తే సరదాకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.

ప్రకృతి ఒడి.. మంచాల విడిది
విస్తరణ కోసం చదును చేస్తున్న ఫామ్‌ ల్యాండ్‌

గ్రామీణ వాతావరణం కోసం చలో మంచాల

వీకెండ్‌లలో గ్రామాల్లో ఆస్వాదిస్తున్న సందర్శకులు

కుటుంబంతో కలిసి వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్న నగర వాసులు

ఫామ్‌ ల్యాండ్స్‌, రిసార్టులతో పల్లెల్లో సందడి

పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన ప్రాంతం

రోజురోజుకూ జనం అభిరుచులను మార్చుకుంటున్నారు. గతంలో సెలవులొస్తే సినిమాలకు, పార్క్‌లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం నగర వాసులు సమీపంలోని గ్రామాలకు వెళ్లి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్‌ సమీప పల్లెలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. మంచాల మండలం కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందుతోంది. ఆర్థికంగా ఉన్న వారు వీకెండ్‌ విడిదికి ఈ ప్రాంతాల్లో ఇళ్లు, గెస్ట్‌హౌస్‌లను నిర్మించుకుంటున్నారు.

మంచాల, జనవరి 9: నగర వాసులకు వారాంతపు, సెలవు రోజుల్లో కాలక్షేపం ఇష్టం. గతంలో సెలవులొస్తే వారు నగరంలోనే సినిమాలు, పార్క్‌లకు వెళ్లేవారు. కానీ నేడు ట్రెండ్‌ మారింది. జనం అభిరుచులను మార్చుకుంటున్నారు. సెలవులొస్తే సరదాకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో నగరానికి చేరువలో ఉన్న ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు సందర్శకుల సందడి పెరుగుతోంది. మంచాల మండలంలోని వివిధ చోట్ల వారాంతపు విడిదికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబంతో వచ్చి ఫామ్‌ ల్యాండ్స్‌, రిసార్టుల్లో కాలక్షేపం చేస్తున్నారు. తమ ఆర్థికస్థోమతకు అనుగుణంగా ఇక్కడి వెంచర్లు, ఫామ్‌ ల్యాండ్స్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వీకెండ్‌ విడిదికి సొంతంగా ఇళ్లు, గెస్టుహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. ఈ పరిణామం రియల్టర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు రియల్టర్లు ప్రాధాన్యమిస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వెంచర్లు, ఫామ్‌ ల్యాండ్స్‌, రిసార్టులను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రకృతి రమణీయంగా ప్రాంతాలు

మంచాల మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ప్రకృతి రమణీయతతో సందర్శకులను కట్టిపడేస్తాయి. కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం కావడంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు జనం తరలివస్తున్నారు. లోయపల్లి సెక్టార్‌ మొత్తం లోయప్రాంతం కావడంతో చుట్టూ కొండలు, మధ్య మైదానం ఊటీని తలపిస్తోంది. రాచకొండ, శ్రీ బుగ్గరామలింగేశ్వర క్షేత్రం, జాపాల-రంగాపూర్‌ అబ్జర్వేటరీ, బోడకొండ వాటర్‌ ఫాల్స్‌ తదితర పర్యాటక కేంద్రాలు సైతం సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. లోయపల్లి సెక్టార్‌ మొత్తం గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడి తండాల్లో సంప్రదాయ వస్త్రధారణ కనిపిస్తుంది. మంచాల పరిసరాల్లో పట్టణ కల్చర్‌ ఉంటుంది. ఆరుట్ల సమీపంలోని గ్రామాలు పాడిపంటలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వీటిని నగర, పట్టణ వాసులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న జనం

ఇక్కడి భూములకు పెరుగుతున్న ధరలు, పెట్టుబడులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది. కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాలు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు, ఫామ్‌ ల్యాండ్స్‌, రిసార్టులు నెలకొల్పుతూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కస్టమర్ల ఆర్థిక వెసులుబాటకు అనుగుణంగా గుంటలు, ఎకరాలుగా విభజన చేసి భూమి విక్రయిస్తున్నారు. ఆ తర్వాత స్థోమతను బట్టి గృహనిర్మాణాలు, స్విమ్మింగ్‌ పూళ్లు, గార్డెన్స్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా నిర్మాణాలు చేసి కస్టమర్లకు అందజేస్తున్నారు. అంతేగాక ఈ నిర్మాణాల్లో రాళ్లు, చెట్లు ఉన్నచోట్ల సహజత్వాన్ని కోల్పోకుండా పరిరక్షిస్తున్నారు.

భూముల కోసం ఫోన్లు చేస్తున్నారు : రాజేష్‌, బండలేమూర్‌, రియల్టర్‌

ఈ మధ్యకాలంలో ఇక్కడి భూములకు రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భూములు చూపించాలంటూ కస్టమర్లు ఫోన్‌ చేస్తున్నారు. సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తున్నారు. కొండలు గుట్టలతో ఉన్న భూములు కావాలంటున్నారు. ఎంత దూరంలో ఉన్నా ఎకరానికి రూ.30లక్షలకు తక్కువ లేకుండా ధర ఉంది. బీటీ రోడ్లకు ఆనుకొని పొలం ఎకరం కోటి రూపాయలపైనే ధరలు ఉన్నాయి.

సెలవుల్లో జనం భారీగా వస్తున్నారు : బెల్లి గోపాల్‌, రైతు, చెన్నారెడ్డిగూడ

మా పొలం పక్కనే ఆరుట్ల హిల్స్‌ ఉంది. ఇక్కడ గుట్టల్లోనే ఫాంల్యాండ్స్‌ ఏర్పాటు చేశారు. అందులోనే ఇళ్లు కట్టి ఇస్తున్నారు. ఇళ్ల చుట్టూ పచ్చగడ్డి గార్డెన్‌ ఉంది. పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు ఉన్నాయి. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో నగరం నుంచి జనం బాగా వస్తున్నారు. పిల్లలతో వచ్చి సాయంత్రం దాకా గడిపి వెళ్తున్నారు. నా పొలంలో కోళ్లఫాం ఉంది. వచ్చే వాళ్లు చాలామంది భూమి అమ్ముతావా? అని అడుగుతున్నారు.

ఉపాధినిచ్చే సంస్థలను నెలకొల్పాలి : పి.ఆనంద్‌, చెన్నారెడ్డిగూడ

మా గ్రామాల్లో రోడ్లు ఇతర జిల్లాలను కలుపుతూ ఉన్నాయి. మా ప్రాంతం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు. స్థానికులకు ఉపాధినిచ్చేలా సంస్థలు నెలకొల్పాలి. మా ప్రాంతం టౌన్‌షి్‌ప వెంచర్లకు, ఫామ్‌ ల్యాండ్స్‌కు అనుకూలంగా ఉంటుంది.

Updated Date - Jan 09 , 2024 | 11:30 PM