నత్తనడకన ఎల్‌ఆర్‌ఎస్
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:55 PM
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది.
పూర్తికాని దరఖాస్తుల పరిశీలన
ఇప్పటి వరకు పరిశీలించినవి ఏడు వేలే..
పంచాయతీల్లో ముందుకు కదలని ప్రక్రియ
కేవలం ఆరు దరఖాస్తులే పరిశీలన
దరఖాస్తుదారుల ఎదురుచూపు
ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తులు : 2,83,689
మున్సిపాలిటీ/కార్పొరేషన్‌లో వచ్చినవి : 2,37,259
ఇప్పటి వరకు పరిశీలించినవి : 7,023
పంచాయతీల్లో వచ్చిన దరఖాస్తులు : 46,430
ఇప్పటి వరకు పరిశీలించినవి : 06
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరతకు తోడు తరచూ సర్వర్ మొరాయిస్తుండటంతో దరఖాస్తుల పరిశీలనలో అవాంతరాలు ఎదురవుతోన్నాయి. కలెక్టర్ శశాంక ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రక్రియను వేగిరం చేయాలని ఆదేశించినా ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు.
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్లాట్లదారులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకు సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తికాలేదు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను సర్వే కోసం నియమించినా ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కాస్త ఫర్వాలేకున్నప్పటికీ పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిశీలన మరీ అధ్వానంగా ఉంది. ఇలాగే ఉంటే నిర్ణీత గడువులో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపల్, పంచాయతీల్లో 2,83,689 దరఖాస్తులు వచ్చాయి. అందులో మున్సిపాలిటీల్లో అత్యధికంగా 2,37,259 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 7,023 మాత్రమే పరిశీలించారు. అలాగే పంచాయతీల్లో 46,430 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేవలం ఆరింటిని మాత్రమే పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో పర్యటిస్తున్నారు. మొదటి దశలో క్షేత్రస్థాయిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ యాప్ ద్వారా పరిశీలన కొనసాగుతోంది. సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన బృందం దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తోంది. అదే సయమంలో ఈ భూములు బఫర్ జోన్, నాలా, చెరువులు, గవర్నమెంట్ ల్యాండ్ పరిధిలోనివి కావని ఈ బృందం ధ్రువీకరిస్తుంది.
ఇప్పటికే ఆధారాలు కలిగిన దరఖాస్తులకు చెందిన ప్లాట్లను స్థానిక అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రికార్డుల్లో ఉన్న వివరాలతో క్షేత్ర స్థాయిలో పోల్చిచూసిన తర్వాత తాజా పరిస్థితులపై నివేదిక ఇస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కానీ.. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులో పరిశీలన పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేవు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వాటిలో ఒక్కశాతం ర్యాండమ్ చెకప్ చేస్తారు. సరైనవని తేల్చినపుడు అర్జీలకు సంబంధించిన వివరాలను మున్సిపాలిటీలు, పంచాయతీలకు పంపుతారు. అన్నివిధాలా అర్హత కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించిన తర్వాతే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఇంకెప్పుడు పరిశీలిస్తారు
రెండు ప్లాట్లకు వేయి రూపాయల చొప్పున డబ్బు లు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పరిశీలనకు రాలేదు. అధికారులు స్పందించి త్వరగా దరఖాస్తులను పరిశీలించి ప్లాట్లను క్రమబద్దీకరించాలి.
- బొక్క నవనీత, కొత్తగూడ, కందుకూరు మండలం
నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న
తెలంగాణ ప్రభుత్వం 2020 ఆగస్టు నెలలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. నా ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి కోసం వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి శుభవార్త చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేసేందుకు దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామన్నారు. కానీ.. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి రాలేదు.
- మారం చంద్రశేఖర్, షాద్‌నగర్