Share News

నా భూమి నాకే చెందాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:11 AM

35 ఏళ్ల క్రితం తనకు భూమి విక్రయించి.. ప్రస్తుతం అదే భూమిని వేరొకరికి విక్రయించారని, ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతూ ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడు గ్రామానికి చెందిన రైతు శివరాజ్‌ మంగళవారం గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిరాహర దీక్షకు పూనుకున్నాడు.

నా భూమి నాకే చెందాలి

తనకు అమ్మిన తర్వాత వేరొకరికి

విక్రయించారని నిరసన దీక్షకు పూనుకున్న రైతు

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 11: 35 ఏళ్ల క్రితం తనకు భూమి విక్రయించి.. ప్రస్తుతం అదే భూమిని వేరొకరికి విక్రయించారని, ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతూ ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడు గ్రామానికి చెందిన రైతు శివరాజ్‌ మంగళవారం గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిరాహర దీక్షకు పూనుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాజ్‌ తండ్రి పండుగ బాలయ్య 1988లో అదే గ్రామానికి చెందిన మంగలి రాంచంద్రయ్య మరో ముగ్గురి నుంచి సర్వేనెంబర్‌ 292లో 32 గుంటల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమిలో బాలయ్య.. అతడి మరణానంతరం ఆయన వారసులు సాగు చేస్తున్నారు. అయితే, అప్పటి నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ చేయమని విక్రయించిన వారిని అడుగున్నా.. కాలయాపన చేస్తూ వచ్చారు. మొదట భూమి విక్రయించిన మంగలి రాంచంద్రయ్య మరో ముగ్గురు చనిపోవడంతో వాళ్ల వారసులు విరాసత్‌ చేయించుకున్నారు. ఇనాం భూమి కావడంతో ఓఆర్‌సీ తెచ్చుకుని ఇతరులకు విక్రయించారు. విషయం తెలుసుకున్న శివరాజ్‌ తనకు న్యాయం చేయాలని దీక్షకు కూర్చున్నాడు. గ్రామస్తులు మద్దతు తెలిపి ఆయనతో పాటు దీక్షలో కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌ గిర్ధావర్‌ను పంపించి వివరాలు తెలుసుకున్నారు. వివరాలు కలెక్టర్‌కు పంపి న్యాయం జరిగే విదంగా చూస్తామని చెప్పారు. అయితే, తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని బాధితుడు తెలిపాడు.

Updated Date - Jun 12 , 2024 | 08:18 AM