Share News

శ్రీరామనవమి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:09 AM

తాండూరులో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామ కల్యాణాన్ని నిర్వహించే ందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను ముస్తాబు చేముస్తాబు చేయడంతో పాటు కల్యాణ మండపాలను సిద్ధం చేశారు.

శ్రీరామనవమి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు
బొంరాస్‌పేట్‌: సీతారాముల ఎదుర్కొళ్లలో మంగళహారతులతో మహిళలు

తాండూరు, ఏప్రిల్‌ 16: తాండూరులో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామ కల్యాణాన్ని నిర్వహించే ందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను ముస్తాబు చేముస్తాబు చేయడంతో పాటు కల్యాణ మండపాలను సిద్ధం చేశారు. తాండూరులోని రైల్వే స్టేషన్‌ హనుమాన్‌, ఇంద్రానగర్‌లోని రామమందిర్‌, ఆదర్శ తులసీనగర్‌ కాలనీలోని వరహ సిద్దివినాయక మందిరం, పాత తాండూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో రాముల వారి పెళ్లి శాస్ర్తోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పట్టణంలో మాంస విక్రయాలు చేపట్టరాదని, చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మటన్‌, చికెన్‌, బీప్‌ మాంసం వ్యాపారులకు , హోటళ్లు, రెస్టారెంట్‌లకు మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కులకచర్ల: కులకచర్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ముజాహిద్‌పూర్‌, తిరుమలాపూర్‌ గ్రామాల్లో హనుమాన్‌ ఆలయాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. బుధవారం జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11:45 గంటల నుంచి 12:45గంటల వరకు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని పలు దేవాలయాల్లో చలువ పందిళ్లు వేసి రంగురంగుల విద్యుత్‌ దీపాలు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఎదులాబాద్‌ రామాలయం, ఘణాపూర్‌లోని శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయం, అంకుషాపూర్‌లోని రామాలయం, కాచవానిసింగారం, ప్రతాప్‌సింగారం, కొర్రెముల, వెంకటాపూర్‌ గ్రామాల్లోని రామాలయాలను ముస్తాబుచేశారు. కల్యాణ మండపాలను సుదరంగా ఆలంకరించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.

బొంరాస్‌పేట్‌: మండల కేంద్రంలో మంగళవారం సీతారాముల ఉత్సవ విగ్రహాలను భూలక్ష్మమ్మ చౌరస్తా నుంచి కల్యాణ ఉత్సవ ప్రాంతానికి తీసుకెళ్లారు. సాయంత్రం వేళలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీతారాముల విగ్రహాలతో పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవలో భజనలతో భక్త సమాజం ఆవరణ వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు జయమ్మ, చెన్నమ్మ, గ్రామ నాయకులు నర్సిములుగౌడ్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:09 AM