Share News

మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.300కోట్లకు పైగా ప్రణాళికలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:12 AM

కొడంగల్‌ మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.300కోట్లకుపైగా ప్రణాళికలు సిద్ధం చేశామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి సహకరించాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.300కోట్లకు పైగా ప్రణాళికలు
సమావేశంలో మాట్లాడుతున్న కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

కొడంగల్‌, ఫిబ్రవరి 5: కొడంగల్‌ మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.300కోట్లకుపైగా ప్రణాళికలు సిద్ధం చేశామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి సహకరించాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొడంగల్‌ అభివృద్ధికి వచ్చే ఐదేళ్లను దృష్టిలో పెట్టుకొని పనులపై ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.300కోట్ల నిధులతో ప్రణాళికలను సీఎం కార్యాలయానికి పంపించామని తెలిపారు. మునిసిపాలిటీ సుందరీకరణలో భాగంగా హైవే రోడ్డు పనుల కోసం అంబేడ్కర్‌ చౌరస్తాలో వ్యాపార డబ్బాలను తొలగించాలని ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అయితే పేదల ఉపాధి, ఇతర కారణాలతో వాటిని తొలగించలేకపోయామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ దుకాణాలు పెట్టుకున్న చిరు వ్యాపారులకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మడిగెలు కేటాయిస్తామని తెలిపారు. అలాగే వినాయక చౌరస్తా నుంచి శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు వెడల్పు పనులకు ప్రతిపాదనలు పంపామన్నారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునిసిపాలిటీలో తక్కువ ఆదాయం ఉందన్నారు. కొత్త పురపాలిక సొంతంగా ఆదాయాన్ని సమకూర్చేందుకు సమయం పడుతుందన్నారు. మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రూ.50లక్షల నిధులు మంజూరు చేయిస్తే తాత్కాలికంగా ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:12 AM