బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం!
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:10 AM
సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తస్కరించిన సంఘటన పోచారం ఐటీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో రిటైర్డ్ ఉద్యోగి
బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,49,997 ఖాళీ!
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి 5: సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తస్కరించిన సంఘటన పోచారం ఐటీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోచారం సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మునిసిపల్ ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో ఉండే ఓ రిటైర్డ్ ఉద్యోగి(71)కి నగరంలోని తార్నాకలో గల ఓ బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్ ఉంది. జనవరి 26న గుర్తుతెలియని వ్యక్తి మాజీ ఉద్యోగికి ఫోన్‌చేసి మీ బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలి, ఓటీపీ వస్తుంది అది చెప్పాలన్నాడు. దీంతో నిజమని నమ్మిన వృద్ధుడు.. సదరు వ్యక్తి అడిగిన ఓటీపీలను మూడుసార్లు చెప్పాడు. దీంతో అతడి బ్యాక్ ఖాతా నుంచి రూ.49,999 చొప్పున మూడుసార్లు మొత్తం రూ.149,997 ఖాళీ అయ్యాయి. తన బ్యాంక్ నుంచి నగదు తస్కరించిన విషయం గుర్తించి బాధితుడు వెంటనే సదరు నెంబర్‌కు కాల్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగి చివరికి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.