Share News

పలుచోట్ల మోస్తరు వర్షం

ABN , Publish Date - May 20 , 2024 | 12:02 AM

జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది.

పలుచోట్ల మోస్తరు వర్షం
ఎడ్ల కళేబరాలను పరిశీలిస్తున్న రైతులు

వీధుల్లో పారిన వర్షపు నీరు

పిడుగుపాటుకు రెండు కాడెడ్ల మృత్యువాత

కేశంపేట/ఇబ్రహీంపట్నం, మే 19: జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. ఎండ తీవ్రత చాలావరకు తగ్గింది. కొన్ని రోజులుగా జిల్లాలో ఇదే వాతావరణం నెలకొంది. క్యూములోనింబస్‌ మేఘాలతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కేశంపేట మండలంలో చిన్నపాటి వర్షం కురిసింది. వీధుల్లో వర్షపు నీరు పారింది. బైర్ఖాన్‌పల్లి, అల్వాల, ఎక్లా్‌సఖాన్‌పేట, సంగెం, కొత్తపేట, వేముల్‌నర్వ, కేశంపేట, ఇప్పలపల్లి, పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లి, కాకునూర్‌, తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్దవెల్లి, లేమామిడి, బొదునంపల్లి, చౌలపల్లి, చింతకుంటపల్లి గ్రామాల్లో వర్షం పడింది. వాన రాకతో వరికోతకొచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వాతావరణం చల్లబడిందని సాధారణ ప్రజలంటున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. పగలంతా మబ్బు కమ్ముకుంది. ఎండలతో ఇబ్బంది పడుతున్న జనం కురుస్తున్న చిన్నపాటి జల్లులతో నాలుగు రోజులుగా ఉపశమనం పొందుతున్నారు.

పిడుగుపడి రెండు ఎడ్ల మృతి

మాడ్గుల: మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలో రైతు ఎండీ ఖాదర్‌కు చెందిన రెండు ఎడ్లు ఆదివారం పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. ఖాదర్‌ ఎప్పటిలాగే పొలం వద్ద చెట్టుకింద ఎడ్లను కట్టేశాడు. సాయంత్రం గాలివానకు పిడుగుపడి రెండు ఎడ్లు మృతిచెందాయి. నిర్జీవంగా పడి ఉన్న ఎడ్లను చూసి ఖాదర్‌ బోరున విలపించాడు. 15 రోజుల క్రితమే ఖాదర్‌ రూ.లక్షన్నరకు ఎద్దులను కొన్నాడని గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు.

Updated Date - May 20 , 2024 | 12:02 AM