Share News

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:06 AM

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ఓటింగ్‌ సాగినా.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం

99.86 శాతం పోలింగ్‌ నమోదు

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ఓటింగ్‌ సాగినా.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. ఓటర్లను ఆయా పార్టీలు క్యాంపులకు తీసుకెళ్లడంతో ఉదయం పెద్దగా ఓటింగ్‌ నమోదు కాలేదు. క్యాంపులకు వెళ్లిన వారు ఒక్కసారిగా బస్సుల్లో తరలివచ్చి ఓటుహక్కును వినియో గించుకున్నారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

క్యాంపుల నుంచి బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు

బీఆర్‌ఎస్‌ క్యాంపు నుంచే అత్యధికంగా..

వారినీ సంప్రదించడంతో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ ఆశలు

ఓటేసిన సీఎం రేవంత్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు..

గెలుపుపై అందరిలోనూ ఉత్కంఠ

షాద్‌నగర్‌/కొడంగల్‌/ఆమనగల్లు/మహబూబ్‌నగర్‌, మార్చి 28 : ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పది పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 1,439 ఓట్లకు గాను 1,437మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 99.86 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌.. క్యాంపులకు వెళ్లిన వారి బస్సులు ఒక్కొక్కటిగా రావడంతో 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో భారీగా పోలింగ్‌ జరిగింది. ఆ తర్వాత మిగిలిన ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మొదటి నుంచీ బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానిక సంస్థల్లో బలం ఉండటం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి ఖరారైన వెంటనే క్యాంపు రాజకీయాలకు తెరలేపడం, ఏకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ సైతం గోవాకు వెళ్లి ప్రజాప్రతినిధులతో గడపటం, అలాగే చాలామంది మంత్రులు, పార్టీలో కీలక వ్యక్తులు ఎప్పటికప్పుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో బీఆర్‌ఎస్‌ క్యాంపును కాపాడుకున్నారు. అయితే కాంగ్రెస్‌ తన బలాన్ని కాపాడుకోవడంతో పాటు నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచే ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది. ఇబ్బడిముబ్బడిగా పార్టీలో చేర్చుకోవడంతో తమ బలం పెంచుకున్నారు. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు క్యాంపులను కూడా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ క్యాంపులకు వెళ్లిన వారితో కూడా టచ్‌లో ఉండి వారిని మేనేజ్‌ చేసుకోవడంతో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. పోరు హోరాహోరీగా సాగడంతో ఎంతవరకు క్రాస్‌ ఓటింగ్‌ అయ్యింది? ఎవరికి విజయావకాశాలు ఉంటాయనే విషయంలో ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు తర్వాతనే తేలనుంది. వాస్తవానికి బీఆర్‌ఎ్‌సకు స్థానిక సంస్థల్లో బలం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కూడా బీఆర్‌ఎ్‌సదే ఉంటే.. అసలు కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలపడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం వల్ల.. ఆ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఈ నేపథ్యంలోనే అందరిలో గెలుపుపై భారీ ఉత్కంఠ నెలకొంది.

పోలింగ్‌ సరళి ఇలా...:

ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. అన్ని సెంటర్లలోనూ 11 గంటల వరకు తక్కువగానే పోలింగ్‌ నమోదైంది. క్యాంపులకు వెళ్లిన వారు 11 గంటల తర్వాతనే వరుసగా బస్సుల్లో రావడంతో పోలింగ్‌ శాతం 2గంటల వరకు భారీగా నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 245 మందికి ఓటు హక్కు ఉండగా.. మొత్తం అందరూ ఓటు వేయడంతో వందశాతం పోలింగ్‌ నమోదైంది. కొడంగల్‌లో 56 ఓట్లు ఉండగా అక్కడా పోలింగ్‌ వందశాతం అయ్యింది. వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌, అచ్చంపేట, షాద్‌నగర్‌, కల్వకుర్తిల్లో కూడా వందశాతం పోలింగ్‌ నమోదైంది. నారాయణపేట పోలింగ్‌ కేంద్రంలో 205 ఓట్లు ఉండగా.. మక్తల్‌ మండలం మంతన్‌గోడ్‌ ఎంపీటీసీ సుమిత్ర ఓటు వేయలేదు. అలాగే నాగర్‌కర్నూలు పోలింగ్‌ కేంద్రంలో 101 ఓట్లు ఉండగా.. 100 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇక్కడ బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారదమ్మ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఆమె రెండు నెలల క్రితం అమెరికా వెళ్లడంతో ఓటు వినియోగించుకోలేక పోయారు. దీంతో పోలింగ్‌ శాతం 99.86 శాతంగా నమోదైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవి గుగులోత్‌ పోలింగ్‌ సెంటర్ల వద్ద పరిస్థితిని వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. వివిధ జిల్లాల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ఎక్స్‌ అఫీషియో ఓట్లు..

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డుమార్గం ద్వారా కొడంగల్‌కు చేరుకున్న ఆయన నేరుగా పోలింగ్‌ కేంద్రంలో ఓటువేసి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఓటు వేయగా.. కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి జడ్పీటీసీ, బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఎక్స్‌ అఫీషియో సభ్యురాలిగా సత్యవతి రాఽథోడ్‌..

మాజీ మంత్రి, మహబూబాబాద్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ గురువారం షాద్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, సురభీ వాణీదేవి, సత్యవతి రాథోడ్‌లు ఇక్కడ తమ పేరు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కొత్తూరు మున్సిపాలిటీ నుంచి ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సత్యవతి రాథోడ్‌ తన ఓటును వినియోగించుకున్నారు.

క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు

స్థానిక సంస్థల ఎన్నిక నేపథ్యంలో అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ సభ్యులను పోటాపోటీగా గోవా తదితర ప్రాంతాలకు వారం రోజుల క్రితమే తరలించారు. అక్కడి నుంచి బస్సు ద్వారా నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న సభ్యులు పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో పోలింగ్‌ సరళిని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సుధీర్‌బాబు పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

ఓటు వేసిన 80 ఏళ్ల ఎంపీటీసీ

కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వయస్సున్న ఎంపీటీసీ సభ్యురాలు పత్లావత్‌ ఢాకీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటరిగానే నడుచుకుంటూ వచ్చి ఓటు వేశారు.

సీఎంకు బహుమతిగా ఇస్తాం...

బీఆర్‌ఎస్‌ పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా ఇబ్బందులు పడ్డారు. మర్యాద లేక.. పదవి ఉన్నా పనిలేక.. నిధులు లేక కష్టనష్టాలకు ఓర్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు. సీఎం రేవంత్‌రెడ్డికి ఈ గెలుపును బహుమతిగా ఇస్తాం. వారికి బలం ఉన్నా.. అందరూ నాకే ఓటు వేశారు. 300 ఓట్ల మెజారిటీతో కచ్చితంగా గెలవబోతున్నాం.. అందరితో మాట్లాడాం.. వారంతా మద్దతు తెలిపారు.

- మన్నె జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

300 పైచిలుకు మెజారిటీతో గెలుస్తా...

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాను బరిలో నిలవడంతో పార్టీ కేడర్‌ అంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేసింది. సీఎం సొంత జిల్లా కావడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందని అందరూ అన్నారని, కానీ క్రాస్‌ ఓటింగ్‌ కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సకు జరిగింది. మాకు 300 పైచిలుకు మెజారిటీ కచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్‌ వారు ప్రలోభాలకు గురిచేసినా.. మా సభ్యులంతా బీఆర్‌ఎ్‌సకే ఓటు వేశారు. 2వ తేదీన విజయకేతనం ఎగురవేస్తున్నాం.

- నవీన్‌కుమార్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

ఓటు వినియోగించుకున్న సీఎం

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం కొడంగల్‌కు చేరుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న వారికి అభివాదం చేస్తూ కొడంగల్‌లో తన స్వగృహానికి చేరుకొని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

పోలైన ఓట్ల వివరాలు

పోలింగ్‌ కేంద్రం మొత్తం ఓట్లు పోలైనవి పురుషులు మహిళలు పోలింగ్‌ శాతం

మహబూబ్‌నగర్‌ 245 245 117 128 100

కొడంగల్‌ 56 56 27 29 100

షాద్‌నగర్‌ 171 171 77 94 100

నారాయణపేట 205 204 89 115 99.51

వనపర్తి 218 218 99 119 100

గద్వాల 225 225 91 134 100

కొల్లాపూర్‌ 67 67 28 39 100

నాగర్‌కర్నూల్‌ 101 100 48 52 99.09

అచ్చంపేట 79 79 37 42 100

కల్వకురి 72 72 31 41 100

మొత్తం 1,439 1,437 644 793 99.86

Updated Date - Mar 29 , 2024 | 12:33 AM