Share News

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:22 AM

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి, చర్యలు తీసుకోవాలని పరిగి ఎంపీపీ కె.అరవింద్‌రావు అన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

పరిగి, ఏప్రిల్‌ 2: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి, చర్యలు తీసుకోవాలని పరిగి ఎంపీపీ కె.అరవింద్‌రావు అన్నారు. పరిగి మండల పరిషత్‌లో మంగళవారం నిర్వహించిన మండలసభలో ఎంపీపీ మాట్లాడారు. వచ్చే రెండునెలల్లో సమస్య మరింత ఝటిలంగా మారే అవకాశముందన్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. సమస్య తీవ్రతను బట్టి సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. నీటి విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఖుదావంద్‌ పూర్‌లో ఏళ్లుగా నీటి సమస్య ఉన్నదని, ఐదేళ్ల నుంచి అడుగుతున్నా సమస్యను పరిష్కరించడం లేదని ఎంపీటీసీ బి.ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవీకాలం ముగియడంతో సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీనిపై ఎంపీపీ స్పందిస్తూ డీఈఈపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గామాన్ని సందర్శించిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. నీళ్లు, విద్యుత్‌, పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పంచాయితీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌భగీరథ డీఈఈ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నీటి సమస్యల పరిష్కారానికి పరిగి సబ్‌ డివిజన్‌కు రూ.98లక్షలు మంజూరైనట్లు తెలిపారు. పాత బోర్లను ప్రెస్సింగ్‌ చేసి వాడుకలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీటీపీ బి.హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీ కె.సత్యనారాయణ, డిప్యూటీ ఈఈ సుదర్శన్‌రెడ్డి,సుబ్రహ్మణ్యం, ఇర్పాన్‌, ఏఈ ఎండీ ఖాజా, ఏవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:22 AM