బేగరికంచ, మీర్కాన్‌పేటలకు మహర్దశ
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:36 AM
ఒకప్పుడు మారుమూల గ్రామాలుగా ఉన్న బేగరికంచ, మీర్కాన్‌పేటలకు మహర్దశ పట్టింది.
కందుకూరు/మహేశ్వరం, జూలై 30 : ఒకప్పుడు మారుమూల గ్రామాలుగా ఉన్న బేగరికంచ, మీర్కాన్‌పేటలకు మహర్దశ పట్టింది. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే గ్రామాలుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం కందుకూరు మండలం మీర్కాన్‌పేట పంచాయతీ పరిధిలోని బేగ రికంచ గ్రామం అనుబంధ గ్రామంగా ఉండేది. గత ప్రభుత్వం దీనిని గ్రామ పంచాయతీగా మార్చింది. ఈ గ్రామంలో 60ఎకరాలలో 765 పవర్‌గ్రీడ్, 100 ఎకరాలలో 420కేఈ సబ్ సబ్‌స్టేషన్, 220కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లను సైతం ఏర్పాటు చేశారు. 45ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలోని అమేజాన్ డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సుమారు 60ఎకరాలను కేటాయించి మెడికల్ కళాశాలతో పాటు 400పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. బేగరికంచ గ్రామ పంచాయతీకి అనుకొని ఉన్న మీర్కాన్‌పేట, పంజగూడ, తిమ్మాయపల్లి రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు అప్పటి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో ఎకరానికి 121గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి 600ఎకరాలను కేటాయించి, హెచ్‌ఎండీఏ తరహాల్లో అభివృద్ధి చేయడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బేగరికంచ, మీర్కాన్‌పేట గ్రామ పంచాయతీల సరిహద్దుల్లో సర్వే నెంబర్ 112లో 57 ఎకరాలలో వృత్తి విద్యానైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సుమారు 100 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే అక్కడే అన్ని హంగులతో ఐటీఐ, ఏటీసీ స్కూల్ భవనాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వచ్చే రెండు సంవత్సరాలలోపు ఈ ప్రాంతం అన్ని హంగులతో అభివృద్ధి చెందనున్నట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహేశ్వరాన్ని తీర్చిదిద్దేందుకు పెద్దపీట : కేఎల్లార్
మహేశ్వరం నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయనుందని మాజీ ఎమ్మెల్యే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్కాన్‌పేటలో స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు గురవారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన పనులను మంగళవారం సాయంత్రం మాజీ జడ్పీటీసీలు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ 600ఎకరాలల్లో హెచ్‌ఎండీఏ తరహాలో అభివృద్ధి చేస్తున్న ప్లాట్లలో రైతులు ఇళ్లు కట్టుకోవడానికి, ఇదే ప్రాంతంలో ఐటీఐ, ఏటీసీ, పీహెచ్‌సీ, కమ్యూనిటీ హాల్‌తో పాటు స్కిల్ యూనివర్సిటీని తమ ప్రభుత్వం నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో నగరవాసులకు ఉండే వసతులన్నింటినీ ఇక్కడి ప్రజలకు సమకూర్చనున్నట్లు తెలిపారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం సీఎం రేంవత్‌రెడ్డి కందుకూరు రావడంతో వ్యాపార సంస్థలను బంద్ చేయించారని అసెంబ్లీలో చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కప్పాటి పాండురంగారెడ్డి, అందుగుల సత్యనారాయణ, ఎండీ అఫ్జల్‌బేగ్, సరికొండ జగన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఎల్లార్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన నెట్ జీరో సిటీలో ఏర్పాటు చేయనున్న సీఎం సభకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పదివేల మందిని సమీకరిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వివిధ గ్రామాలకు చెందిన రైతుల భూములతో పాటు ప్రభుత్వ భూములు మొత్తం 19వేల ఎకరాలను సేకరించాలని చూడగా అక్కడ కేవలం 12 వేల ఎకరాలే సేకరించారన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీ మోడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుందని చెప్పారు. అందుకోసం మొదటగా ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నామన్నారు.